calender_icon.png 10 September, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమాపై పన్ను సబబా!

08-08-2024 12:00:00 AM

‘అందరికీ ఆరోగ్యం’ అన్నది ప్రభుత్వాల నినాదం. వాస్తవానికి ప్రజలందరికీ ఆరోగ్య సేవలను అందించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యాల్లో ఒకటి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, అవి దేశంలోని అత్యధిక ప్రజల అవసరానికి ఉపయోగపడడం లేదనేది వాస్తవం. మోడీ ప్రభుత్వం తెచ్చిన ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ కానీ, రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కానీ కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి నేటి స్పీడ్ యుగంలో ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా, మరెందరో ప్రాణాపాయ స్థితుల్లో ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తున్నది.

అంతేకాదు, వివిధ ఆరోగ్య సమస్యలతో జనం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఈ పథకాలేవీ వారికి తక్షణ సాయంగా నిలవడం లేదు. దీంతో చాలామంది ప్రైవేటు బీమా సంస్థల ఆరోగ్య, జీవిత బీమా పథకాలను ఆశ్రయిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ‘బీమా’ నిత్యావసరమైంది. ఈ నేపథ్యంలో ఈ పాలసీలు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు, ప్రభుత్వాలు ప్రయత్నించాలి. కానీ, ఆ దిశగా చర్యలు ఉన్నట్టు లేవు. గత నెల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు బీమా కంపెనీలు జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలను భారీగా పెంచాయి. రెండేళ్ల క్రితం ఏడాదికి రూ.10 వేలు ప్రీమియం ఉన్న పాలసీకి ఇప్పుడు రూ.15 వేలు చెల్లించాల్సి వస్తున్నదని అంటున్నారు.

దీనికి తోడు ఈ పాలసీల ప్రీమియంలపై కేంద్రం 18 శాతం వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని విధిస్తున్నది. అన్నీ కలిపితే తడిసి మోపెడు కావడంతో అనేకమంది ఈ పాలసీలను ఇష్టపడడం లేదు. గత కొంతకాలంగా కంపెనీలు బీమా పాలసీలపై జీఎస్టీని తగ్గించాలని, వీలైతే పూర్తిగా మినహాయించాలనీ కోరుతు న్నాయి. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. వారం రోజల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయమై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఘాటైన లేఖ రాయడంతో విషయం ప్రాధాన్యతను సంతరించుకొంది.

‘బీమా పాలసీలపై పన్ను విధించడమంటే జీవితంలో ఎదుర య్యే అనిశ్చితులపై పన్ను విధించడంతో సమానం’ అని గడ్కరీ ఘాటుగా విమర్శించారు. తక్షణమే ఈ పన్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశా రు. ఇప్పుడు ఈ సమస్య పార్లమెంటుకు చేరింది. బీమా పాలసీలపై జీఎస్టీని ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష కూటమి ఎంపీలు పార్లమెంటు వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ ఎంపీలూ ఈ ‘ప్రజా వ్యతిరేక పన్ను’పై పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు ఈ పాలసీలపై జీఎస్టీ కారణంగా గత మూడేళ్లలో ప్రభుత్వానికి రూ.27 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం అంగీరించింది. అయితే, ‘బీమా ఓ సేవ మాత్రమేకాక ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేది కూడా’ అన్నది ప్రభుత్వ వాదన. బీమా పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతూ వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు, సూచనలు వచ్చాయని ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిలేనని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

‘2047 నాటికి అందరికీ బీమా’ అన్న బీమా రెగ్యులేటర్ (ఐఆర్‌డీఏఐ) లక్ష్యాన్ని ఆర్థికశాఖ పార్లమెంటు స్థాయీ సంఘం గుర్తించింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలనీ గత ఫిబ్రవరిలోనే కేంద్రానికి సమర్పించిన నివేదికలో సూచించింది. అయితే, పెరిగిన ద్రవ్యోల్బణం, వ్యాపార నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం ఈ పథకాలపై జీఎస్టీని తగ్గించినా బీమా కంపెనీలు ఆ మేరకు లబ్ధిని వినియోగదారులకు అందిస్తాయా అనేదే అనుమానం. అలా జరగనప్పుడు ఆ లక్ష్యం శుష్క నినాదంగా మాత్రమే మిగులుతుంది కదా!