నీతి పద్యాలను నేర్పుదాం!
తెలుగు ఉమ్మడి రాష్ట్రాల పాఠశాలల్లో శతకాలలోని పద్యాలను పిల్లలతో వల్లె వేయించడం తప్పనిసరిగా చేయాలి. తద్వా రా ముందు తరానికి నైతిక, సామాజిక, కుటుంబ విషయాలలో ఎలా మెలగాలో నేర్పించిన వాళ్లమవుతాం. ఒకప్పుడు చదువులకు కొలమానంగా పద్యాలు అనర్గళంగా పాడడం ఉండేది. కానీ, నేడు అది కరువయింది. ప్రాథమిక దశ నుండి పదవ తరగతి వరకు కొన్ని నీతి పద్యాలు తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉంటున్నప్పటికీ ఇంకా విస్తృతంగా అందించాల్సిన అవసరం ఉంది.
పిల్లలకు చిన్ననాటి నుండి జీవితపాఠాలు నేర్పేవి, లోకజ్ఞానం కలిగించేవి, సద్గుణాలు పెంచేవి, ధర్మనిరతిని ఉపదేశించేవి ఏమైనా ఉన్నాయా? అంటే అవి నీతి పద్యాలు మాత్రమే అని మనం సగర్వంగా చెప్పవచ్చు. కానీ, చిన్నారులు నేడు వీటికి దూరమవుతున్నారు. నీతి పద్యాలను అందించే శతకాలు నేడు కరువవుతున్నాయి. వేమన, సుమతి, భాస్కర,దాశరథి, శ్రీ కాళహస్తీశ్వర, కుమార, కుమారి, నరసింహ, శ్రీకృష్ణ వంటి శతకాలు తెలుగువారికి సుపరిచతమైనా శతకాలెన్నో అనేకమంది చిన్నారులకు అందడం లేదు.
ఒక అలవాటుగా మార్చుకోవాలి
శతక పద్యాలలో ప్రతీ పద్యం ఏదో ఒక నీతిని ప్రబోధిస్తుంది. శతకం అంటే 100 లేదా 108 పద్యాల సంకలనం. ఇందులో అన్ని పద్యాలు ఒకే వృత్తంలో ఉండి, అన్నింటికి ఒకే మకుటం ఉంటుందని, ఈ మకు టాన్నిబట్టి ఆ పద్యం ఏ శతకానికి చెందిందో సులువుగా గుర్తించే వీలుంటుంది. మకుటం అనేది శతక పద్యాల ప్రక్రియలో ఒక ప్రత్యేకతగా చెప్పాలి. శతకాలలో భక్తికి సంబం దించినవి, సమాజాభివృద్ధికి ఉపయోగకరమైనవి, నీతిని తెలియచేసేవి ఇలా ఎన్నో అంశాలతో ఉంటాయి. పిల్లలు మాతృభాషపై పట్టు పెరిగి అదే విధానంలో, భావ వ్యక్తీకరణను తెలుసుకుంటాడు. జ్ఞాపక శక్తీ వృద్ధి చెంది భవిష్యత్‌లో ఉన్నతుడుగా ఎదుగుతారు. తీరిక వేళల్లో పెద్దలు వారికి తప్పకుండా శతక పద్యాలు నేర్పడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల వారికి మానసిక ఆనందంతోపాటు మానవీయ కోణాలూ తెలుస్తాయి.
తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకం రాసే విధానం ప్రారంభమైనట్లు చరిత్రకారులు గుర్తించారు. ఈ 800కు పైగా సంవత్సరాలలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా వ్యాపించింది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులోవలె ప్రత్యేకతను సంతరించుకోలేదు. తెలుగులో ఇప్పటికీ ఎక్కడో ఒకచోట శతకం వెలువడుతూనే ఉంది. పండిత పామరులు, పిల్లలు- పెద్దలు తేడా లేకుండా చదువురాని వారితోసహా ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమ య్యే లా, అందరూ చదువగలిగేలా శతక పద్యా లు ఎక్కువగా సరళతరంగా వుంటాయి. తెలుగుకు సమాంతరంగా ఉన్న కన్నడ, తమిళ, మలయాళ భాషలలో వెలువడిన శతకాల సంఖ్య అతి తక్కువ. కన్నడలో శతక రచన తెలుగుకంటే ముందు ప్రారంభమైనా ప్రాధాన్యం మాత్రం అంతంత మాత్రమే. ఆంగ్ల మాధ్యమ చదువులవల్ల శతక పద్యా లు కనబడకుండా పోయాయి. శతకాలు రాయబడిన కాలాల సామాజిక పరిస్థితులనే కాదు, ప్రస్తుత పరిస్థితులకు కూడా అద్దం పడతాయి. పిల్లలకు తెలుగు నీతి పద్యాలు కనీసం వారానికి రెండు నేర్పినా సామాజిక, నైతిక విలువలు వారికి అబ్బుతాయి.






