పిట్రోడా పితలాటకం
లోక్‌సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ఓవర్సీస్ విభాగం చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. మొన్నటికి మొన్న ‘వారసత్వ పన్ను’పై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన అది పూర్తిగా సద్దుమణగక ముందే కొత్త దుమారానికి తెరలేపారు. భారత్‌ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో వివిధ ప్రాంతాల ప్రజలపై ఆయన చెప్పిన పోలికలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం మరోసారి బయట పడిందంటూ మండిపడింది. ప్రధాని మోడీ సైతం పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శరీరం రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? చర్మం రంగు ఆధారంగా మన దేశస్థులను ఎవరు అవమానిం చినా సహించేది లేదంటూ మండిపడ్డారు. ‘పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యలకు యువరాజు సమాధానం చెప్పాలి’ అంటూ రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిట్రోడా వ్యాఖ్యలు ఎన్నికల వేళ రాజకీయ దుమారానికి దారి తీస్తుండడంతో కాంగ్రెస్‌సైతం దిద్దుబాటు చర్యలకు దిగింది. అవి దురదృష్టకరమని, ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, కాంగ్రెస్‌కు వాటితో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు.ఈ పరిణమామాలు చివరికి పిట్రోడా పదవికే ఎసరు తెచ్చాయి.
ఇంతకీ శామ్ పిట్రోడా ఏం మాట్లాడారు? ఓ జాతీయ ఆంగ్లపత్రికకు ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించిఆయన మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశమే ఉత్తమ నిదర్శనం. మనది వైవిధ్య దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బులుగా కనిపిస్తారు. ఇక, ఉత్తరాది వారు శ్వేతజాతీయులుగా, దక్షిణాది వారు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారు. ఇవన్నీ ఎలా ఉన్నా మనమంతా సోదర సోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుం టాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకు పోయాయి’ అని అన్నారు.
నిజానికి పిట్రోడా ప్రాంతాలనుబట్టి ప్రజల రూపురేఖల్లో కనిపించే తేడాలను గురించే మాట్లాడారు.కానీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతలు చేసే వ్యాఖ్యల్లో ఎక్కడ తప్పు దొరుకుతుందా అని దుర్భిణి వేసి వెతుకుతుండే నేతలకు ఆయన వ్యాఖ్యలు మరో ఆయుధాన్ని ఆందించాయి. పిట్రోడా వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి కిరెన్ రిజిజు మొదలుకొని బీజేపీ నేతలంతా ముప్పేట దాడి మొదలు పెట్టారు. ‘ఇది జాతి వివక్ష’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పిట్రోడా వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం కొత్తేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ మేధావి వర్గ్గాల్లో ఒకరైన పిట్రోడా గతంలో కూడా పలు అంశాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, వాటిపై ఆయన, లేదాపార్టీ వివరణలు ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. గత ఏడాది అయోధ్య రామమందిరం ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు మందిర నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనే లేవనెత్తాయి.
నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, విద్యారంగ, ఆరోగ్య సమస్యలు లాంటి దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు మందిర నిర్మాణాలు పరిష్కారం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించగా, మేధావి వర్గాలు ఆలోచించేలా చేశాయి. అలాగే, 2019లో ఫుల్వామా దాడి అనంతరం భారత వాయుసేన బాలాకోట్‌పై జరిపిన ప్రతీకార దాడులపైన, 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కు వ్యతిరేక దాడులపైన పిట్రోడా చేసిన వ్యాఖ్య లు అప్పట్లోనూ వివాదాస్పదమయ్యాయి. ఎంతటి మేధావి అయినా రాజకీయ వ్యాఖ్యలు చేసేటప్పుడు పరిణామాలను ఆలోచించాలి. లేకపోతే, వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగానూ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే వాస్తవాన్ని పిట్రోడాలాంటి నేతలు గ్రహిస్తే మంచిది.






