17-12-2025 12:00:00 AM
నేడు జాతీయ పింఛన్ దారుల దినోత్సవం :
భారతదేశంలో ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగుల జీవితంలో పెన్షన్ వ్యవస్థకు అపూర్వమైన ప్రాముఖ్యత ఉంది. వృద్ధాప్యంలో గౌరవంతో, భద్రతతో జీవించేందుకు పెన్షన్ ఒక ముఖ్యమైన ఆధారం. పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదు. ఇది ప్రభుత్వ సేవ చేసిన వారందరికీ సమాజం ఇచ్చే గౌరవం, ప్రభుత్వం అందించే భరోసా, రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఈ హక్కును మరింత బలపరిచిన చారిత్రాత్మక తీర్పు వెలువడిన రోజు.. డిసెంబర్ 17. అందుకే ఈరోజును జాతీయ పెన్షన్ దారుల దినోత్సవంగా పాటిస్తున్నారు.
1982లో భారత సుప్రీంకోర్టు డి.ఎస్. సకారియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు భారతదేశ పింఛన్ వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. ఈ తీర్పు పెన్షన్‌ను ‘దానం’ లేదా ‘కృతజ్ఞతా బహుమతి’ అన్న భావన నుంచి తొలగించి, ఇది ఉద్యోగి సంపాదించిన సామాజిక భద్రతా హక్కు అని ప్రకటించింది. పింఛన్ చెల్లించడం ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యత. పింఛన్ చెల్లింపులు జీవనాధార హక్కులో ఒక భాగం.
సుప్రీంకోర్టు తీర్పు భారతదేశంలోని కోట్లాది పింఛన్ దారులకు గౌరవత్వం, సమా నత్వం, న్యాయం, భద్రతలను నిర్ధారించింది. పింఛన్ దారులకు నిజమైన పండుగ దినంలా మారిందనడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాలిడేషన్ బిల్లు పెన్షన్ దారుల హక్కులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశముంది. ఈ బిల్లు ప్రభుత్వ నిర్ణయాలను వెనుక తేదీ నుంచి చట్టబద్ధం చేసుకునే అవకాశం ఇస్తోంది.
ఇది సకారియా తీర్పు ఇచ్చిన రక్షణలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముంది. ఈ బిల్లు వల్ల పెన్షన్ దారుల హక్కులు దెబ్బతినే అవకాశం, పాత-కొత్త పెన్షన్ దారుల మధ్య వివక్షను చట్టబద్ధం చేసే అవకాశం, కోర్టుల్లో న్యాయం పొందే అవకాశాలు తగ్గిపోయే అవకాశముంది. అయితే నేడు పెన్షన్ దారులు అనుభవిస్తున్న గౌరవం, హక్కులు, సౌకర్యాలు అన్నీ స్వయంగా వచ్చినవి కాదు. వారి సంఘాలు, నాయకులు దశాబ్దాల పాటు చేసిన ఉద్యమాలు, ఆందోళన లు, న్యాయపోరాటాల వల్లే ఇదంతా సాధ్యపడింది.
అందుకే ఈ పోరాట చరిత్రను స్మరించడం, పెన్షన్ హక్కుల కోసం ఉద్యమించిన నాయకుల సేవలను గౌరవించడం, భవిష్యత్తు తరాలకు పెన్షన్ వ్యవస్థను రక్షించడం ప్రతి పెన్షన్ దారుడి బాధ్యత. పెన్షన్ ఉద్యమాలకు నేతృత్వం వహించిన నాయకుల పోరాటాన్ని గౌరవించాలి. తమ సంఘాల పట్ల సంఘీభావాన్ని బలంగా తెలియజేయాలి.
భవిష్యత్తు తరాల కోసం పింఛన్ వ్యవస్థను రక్షించేందుకు తమ వంతు కృషి చేయాలి. ఇవాళ పెన్షన్ దారులంతా ఐక్యంగా నిలబడి పోరాటానికి సిద్ధం కాకపోతే పెన్షన్ అమలు విధానంలో రాబోయే తరాలు ఎదుర్కొనే సమస్యలు మరింత పెరిగే అవకాశముంది. ఈ పోరాటం రాబోయే తరాలకు ఒక ఆదర్శంగా నిలవాలి.
బుచ్చిబాబు