calender_icon.png 19 December, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో రాజకీయ వేడి!

17-12-2025 12:00:00 AM

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హాదీపై కాల్పుల ఘటన కలకలం రేపింది. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో గత శుక్రవారం ప్రచారంలో పాల్గొన్న షరీఫ్ హాదీపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. తలలోకి బులెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన హాదీ చికిత్స పొందుతున్నాడు.

హాదీపై కాల్పులను ఖండించిన ఇంక్విలాబ్ మంచ్ సంస్థ దీని వెనుక బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ హస్తం ఉందంటూ ఆరోపణలు చేసింది. గతేడాది హసీనా పదవి కోల్పోవడం వెనుక ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలకంగా ఉన్నాడు. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన తర్వాత ఇంక్విలాబ్ మంచ్ ఏర్పాటయింది. ఇంక్విలాబ్ మంచ్ ముందు నుంచి ఆవామీ లీగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వచ్చింది.

ఆవామీ లీగ్ పార్టీ ఉనికి దేశంలో లేకుండా చేయాలంటూ ఇంక్విలాబ్ మంచ్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆవామీ లీగ్‌ను ఎన్నికల్లో పాల్గొనకుండా యూనస్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13న షరీఫ్ హాదీ ‘బృహత్తర బంగ్లాదేశ్’ పేరుతో మ్యాప్‌ను విడుదల చేశాడు. ఇందులో బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌లోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలను కలుపుతూ పోస్టర్‌ను విడుదల చేయడం చర్చనీయాంశమైంది.

మరోవైపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సహా ప్రజలు ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టడంతో బంగ్లాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. దీంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభు త్వం ఎన్నికలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఆగస్టు 2024 ఆందోళనల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలను నిషేధించారు.

గణనీయమైన మద్దతు ఉన్న ఆవామీ లీగ్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం, ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు హసీనా పాలనలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఈ ఎన్నికల్లో ముందున్నట్లు భావిస్తున్నారు. గతేడాది విద్యార్థి ఆందోళనలకు నేతృత్వం వహించిన నేషనల్ సిటిజన్ పార్టీ , జమాత్--ఏ-ఇస్లామీకి చెందిన అమర్ బంగ్లాదేశ్ (ఏబీ) పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.

దీంతో బంగ్లాదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. తాజాగా హదీపై దాడి కూడా బంగ్లాదేశ్ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించనున్న ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని తాము కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది.

ఈసారి బంగ్లాదేశ్‌లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. షేక్ హసీనా తొలగింపు తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రావాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగిపోయింది. బంగ్లా భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలను భారత్ కూడా ఆసక్తికరంగా పరిశీలిస్తున్నది.