calender_icon.png 25 January, 2026 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికెన్ తో చిరుతిల్లు

28-12-2024 12:00:00 AM

బయట చల్లటి వాతావరణం..  పైగా చలికాలం.. సాయంత్రం కాగానే.. సమోసాలు.. బజ్జీలు.. పానిపూరీకి బదులుగా.. ఇంట్లోనే మీకు నచ్చిన స్టయిల్లో.. ఈజీగా చికెన్‌తో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. దాంతో బయటి ఫుడ్ తగ్గించినట్టు ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. వరుసగా రెండు రోజులు సెలవులు.. ఇవాళ వీకెండ్.. రేపు ఆదివారం.. సాయంత్రం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీతో వేడి వేడిగా ఉండే చికెన్ చిరుతిళ్లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

చికెన్ కబాబ్స్

కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ పావుకిలో, పెరుగు మూడు చెంచాలు, నూనె రెండు చెంచాలు, ఉప్పు తగినంత, నిమ్మరసం చెంచాన్నర, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర చెంచా, గరంమసాలా చెంచా, కారం చెంచా, ఉల్లిపాయ ఒకటి, క్యాప్సికం ఒకటి. 

తయారీ విధానం: ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ని పెద్ద ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. వీటితో పాటు ఒక పాత్రలో పైన చెప్పిన అన్నింటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో కనీసం నాలుగు గంటలపాలైనా ఉంచాలి. తర్వాత కబాబ్స్ స్క్యూయర్స్ కి చికెన్, ఉల్లిపాయముక్కలు, క్యాప్సికం ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి గుచ్చి గ్రిల్‌పై అన్నివైపులా కాల్చుకోవాలి. ఇష్టమున్నవారు పైన బటర్ రాసుకుంటే బాగుంటుంది. సన్నసెగమీద పావుగంటపాటు కాలిస్తే ముక్క ఉడికి రుచిగా ఉంటుంది. 

చికెన్ నగ్గెట్స్

కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ పావుకిలో, వెల్లుల్లి పేస్ట్ చెంచా, మిరియాల పొడి అరచెంచా, మైదా ఒక కప్పు, కారం చెంచాన్నర, బ్రెడ్ క్రంబ్స్ కప్పున్నర, పెరుగు అరకప్పు, అల్లం పేస్ట్ చెంచా, ఉప్పు తగినంత, గుడ్లు రెండు, మిక్స్‌హెర్బ్ పౌడర్ చెంచా, నూనె వేయించడానికి సరిపడా, గార్లిక్ పౌడర్ అరచెంచా. 

తయారీ విధానం: ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లిపేస్ట్, చెంచా కారం వేసి బాగా కలిపి, శుభ్రం చేసిన చికెన్‌ని వేసి ఫ్రిజ్‌లో గంటన్నరపాటు ఉంచాలి. ఈలోపు మూడు వేర్వేరు పాత్రలు తీసుకుని ఒకదానిలో గిలక్కొట్టిన గుడ్లసొన తీసుకోవాలి.

మరొకదానిలో మైదా తీసుకుని దానిలో ఉప్పు, గార్లిక్ పౌడర్, అరచెంచా కారం, మిక్స్‌హెర్బ్ పౌడర్ వేసి కొద్దిగా నీళ్లతో కలిపి పెట్టుకోవాలి. మరొక గిన్నెలో బ్రెడ్ క్రంబ్స్ పొడి వేసుకోవాలి. చికెన్ ముక్కలని ముందుగా గిలక్కొట్టిన గుడ్డు సొనలో ముంచి తర్వాత మైదాలో ఆ తర్వాత బ్రెడ్‌పొడిలో వేసి కలపాలి. వీటిని నూనెలో వేయించుకోవాలి. కరకరలాడే చికెన్ నగ్గెట్స్‌ని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. 

చికెన్ పకోడి

కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ అరకిలో, అల్లం తరుగు చెంచా, పచ్చిమిర్చి రెండు, జిలకర పొడి చెంచా, ధనియాల పొడి చెంచా, కొత్తిమీర తరుగు చెంచా, కారం చెంచా, నూనె వేయించడానికి సరిపడా, ఉప్పు తగినంత. 

తయారీ విధానం: ఒకపాత్రలో తగిన పరిమాణంలో తరిగిన చికెన్ ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, జిలకర పొడి, ధనియాపొడి, కారం వేసి బాగా కలిపి అరగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత దీనిపై తగినంత ఉప్పు, శనగపిండి, మొక్కజొన్న పిండి, వంటసోడా వేసి తగినన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. ఒక కడాయిలో తగినంత నూనె తీసుకుని పకోడీలా మాదిరిగా వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ పకోడి రెడీ. 

చికెన్ వింగ్స్

కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్ కిలో, మైదాపిండి కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి, కారం, ఉల్లిపాయపొడి, గార్లిక్ పొడి చెంచా, నూనె వేయించడానికి సరిపడా, బటర్ రెండు చెంచాలు, సోయాసాస్, తేనె, బ్రౌన్ షుగర్ పావుకప్పు, వెల్లుల్లి తురుము చెంచా, పచ్చిమిర్చి రెండు, ఎండుమిర్చి రెండు, శ్రీరాచాసాస్ రెండు చెంచాలు, నువ్వులు చెంచా. 

తయారీ విధానం: చికెన్ వింగ్స్‌ని కడిగి టిష్యూ పేపర్ మీద ఆరబెట్టాలి. పెద్ద గిన్నెలో మైదా, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ వింగ్స్‌కి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. కడాయిలో నూనె వేసి చికెన్ ముక్కలను గోధుమ రంగులోకి వచ్చే వరకూ వేయించి.. టిష్యూ పేపర్ మీద పక్కన పెట్టుకోవాలి.

వెడల్పాటి గిన్నెలో బటర్ వేసి మధ్యస్థంగా ఉండే మంట మీద కరిగించాలి. అల్లం, వెల్లుల్లి తురుము వేసి సువాసన వచ్చేవరకూ రెండు నిమిషాలు వేయించుకుని అందులో సోయాసాస్, తేనె, బ్రౌన్ షుగర్, శ్రీరాచాసాస్ జోడించి బాగా కలపాలి. సాస్ కొద్దిగా చిక్కబడేవరకూ ఐదు నిమిషాలు పెద్దమంట మీద ఉడికించాలి. ఇప్పుడు వేయించిన చికెన్ ముక్కలను సాస్‌కు జతచేయాలి. చికెన్ వింగ్స్‌కు సాస్ పట్టేవరకూ మీడియం మంట మీద వేయించాలి. చివర్లో నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేస్తే సరిపోతుంది.