calender_icon.png 19 May, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీ సమస్యలా!

18-05-2025 12:00:00 AM

మనదేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో కిడ్నీలకు సంబంధించిన రోగుల సంఖ్య రెట్టింపు అయిందని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు రెండు లక్షల మంది ఉండగా.. ప్రతి సంవత్సరం కేవలం 12 వేల కిడ్నీ మార్పిడులు మాత్రమే అవుతున్నాయి. ఈ లెక్కలన్నీ కిడ్నీ ఆరోగ్య సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. అయితే కిడ్నీ వ్యాధి సమస్య తగ్గించడం కోసం.. వ్యాధికి గల కారణాలు, తీవ్రత తగ్గించడానికి అవసరమైన అవగాహన గురించి తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి ఏడాది సుమారు ఐదు లక్షల మంది డయాలసిస్ రోగులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దేశ జనా భాలో 17 శాతం మందికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, హైబీపీతో బాధపడుతున్న వారు కిడ్నీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలో ప్రమాదకర వ్యాధులను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

కొన్ని సంకేతాలు.. 

* కిడ్నీ సమస్యకు తొలిదశలో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. శరీరంలో వ్యాధి ముదురుతూ వస్తున్నకొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. వీటిని ముందుగా గుర్తిస్తే జబ్బు తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు.  

* కిడ్నీ పనితీరు సన్నగిల్లితే రక్తహీనతకు దారితీస్తుంది. ఇందులో ఎర్ర రక్తకణాల సంఖ్య పడిపోతుంది. దీంతో కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందక నిస్సత్తువ, నీరసం, అలసట వంటివి దరిచేరతాయి. ఇవి రోజువారీ పనులకూ ఆటంకం కలిగిస్తాయి.

* ఎక్కువగా ఉన్న ద్రవాలను కిడ్నీలు తొలగించ లేకపోవడం పెద్ద సమస్య. దీంతో ద్రవాలు శరీరంలోనే.. ముఖ్యం గా కాళ్లు, మడమలు, పాదాలు, కళ్ల చుట్టూ పోగు పడతాయి. ఫలితంగా పాదాలు, కళ్ల ఉబ్బు మొదలవుతాయి. 

* మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపిస్తాయి. తరచూ.. ముఖ్యంగా రాత్రి పూట మూత్రం రావటం, మూత్రం ఉత్పత్తి తగ్గటం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించడం వంటివన్నీ కిడ్నీ సామర్థ్యం సన్నగిల్లుతుంద నడానికి సంకేతాలే. 

* కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే క్యాల్షియం, ఫాస్ఫేట్ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటివి తలెత్తుతాయి. 

* రక్తంలో విషతుల్యాలు పోగుపడుతున్నకొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది. వికారం మొదలవుతుంది. దీంతో ఏదీ తినబుద్ది కాదు. సరిగా తినకపోవడం వల్ల బరువు తగ్గుతుంది. తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటివి కనిపి స్తాయి. సమస్య తీవ్రమైతే మూర్ఛవ్యాధికి దారితీయొచ్చు. 

* ఇలాంటి లక్షణాలు ఇతర జబ్బుల్లో నూ కనిపిస్తుండటం వల్ల చాలామంది పొరపడుతుంటారు. దీంతో చికిత్స తీసుకోవడం ఆలస్యమవుతుంది. కాబ ట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్లక్ష్యం పనికిరాదు. తొలిదశలోనే కిడ్నీ సమస్యను గుర్తిస్తే చికిత్స తేలిక అవుతుందని తెలుసుకోవాలి. 

కారణాలు?  

డయాబెటిస్: కిడ్నీలు దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి డయాబెటిస్. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వైఫల్యానికిది ప్రధాన కారణం ఇదే. రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే కిడ్నీల్లోని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్తాన్ని వడపో సే నెఫ్రాన్లూ క్షీణిస్తాయి. మధుమేహం తో ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఇవీ కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదముంది. 

అధిక రక్తపోటు: దీర్ఘకాలంగా రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీల మీద విపరీత భారం పడుతుంది. క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. నిజానికి అధిక రక్తపోటు కిడ్నీ జబ్బుకు సంకేతమే. 

రక్తనాళాల వాపు: ఇన్‌ఫెక్షన్లు, స్వీయ రోగనిరోధక జబ్బులు, కొన్ని రకాల మం దులతో కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల్లో వాపు (గ్లోమరులో నెఫ్రయిటిస్) తలెత్తొచ్చు. ఇది కిడ్నీ వైఫల్యానికి కారణం అవుతుంది. 

యూరిన్ ఇన్‌ఫెక్షన్లు: కొందరికి తరచూ యూరిన్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వీటికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీలూ దెబ్బతినే ప్రమాదముంది. 

ఇలా చేస్తే.. కిడ్నీలు సేఫ్!

కిడ్నీ సమస్యలతో బాధపడటం కన్నా రాకుండా చూసుకోవడమే మంచిది. ఇం దుకు కొన్ని జాగ్రత్తలు ఉపయోగపడతా యి. ఇవి కిడ్నీ సమస్య నుంచి ముప్పు తగ్గటానికి, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటా నికి, కిడ్నీ సమస్యలున్నా.. వ్యాధి ముదరకుండా చూసుకోవడానికి తోడ్పడతాయి. 

* రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకు ఆహార, వ్యాయామ నియమాలు తోడ్పడతాయి. మొత్తం మీద రక్తపోటు 130/80 కన్నా మించకుండా చూసుకోవాలి. 140/90, అంతకన్నా ఎక్కువ ఉంటే మందులు వేసుకోవాలి. 

* మధుమేహం గలవారు గ్లూకోజును కచ్చితంగా నియంత్రించుకోవాలి. మూడు నెలల సగటు గ్లూకోజును తెలిపే హెచ్‌బీఏ1సీ 7 కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తరచూ గ్లూకోజు పరీక్షించుకోవడం, సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం, క్రమం తప్పకుండా మందులేసుకోవటం ప్రధానం. 

* ఆరోగ్యకరమైన జీవనశైలి కిడ్నీలకు పెద్ద రక్ష. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. రోజుకు 5-6 గ్రాముల ఉప్పు మించకుండా చూసుకోవాలి. జంక్ ఫుడ్, నిల్వ ఆహార పదార్థాలు మానెయ్యాలి. క్ర మం తప్పకుండా వ్యాయామం  చేయ డం తప్పనిసరి. రోజుకు కనీసం అరగం ట సేపైనా నడక, కాస్త వేగంగా పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత కొట్టడం వంటివి చేయాలి. వ్యాయామంతో శారీరక, మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తా యి. రక్తంలో గ్లూకోజు, రక్తపోటూ తగ్గుతాయి. ఇవన్నీ కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడేవే. 

* బరువు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఊబకాయులకు కిడ్నీజబ్బు ముప్పు 2-7 రెట్లు ఎక్కువ. అధిక బరువుతో కిడ్నీలపైనా భారం పెరుగుతుంది. ఊబకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం ముప్పు పొంచి ఉంటాయి. ఇవీ కిడ్నీలను దెబ్బతీసేవే. కాబట్టి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 కన్నా మించకుండా చూసుకోవాలి. 

* సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగితే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీ లకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితం గా కిడ్నీ జబ్బు ముప్పు పెరుగుతుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లొద్దు. 

* మద్యం ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి. కాలేయం దెబ్బతింటుంది. కిడ్నీ పనితీరు మందగిస్తుంది. కాబట్టి మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. అలవాటు లేనివారు దీని జోలికి వెళ్లొద్దు. 

* రక్తంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి. మాంసాహారం, వేపుళ్లు తగ్గించుకోవాలి. 

అందరికీ చికిత్స ఒకేలా ఉండదు 

కిడ్నీ వ్యాధులకు చికిత్స అందరికీ ఒకేలా ఉండదు. జబ్బు దశ, జబ్బుకు దారితీసిన అంశాలు, ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. వ్యాధి త్వరగా ముదరకుండా, లక్షణాలను తగ్గించేలా, రోజువారీ జీవితాన్ని హాయిగా గడిపేలా చూడటమే చికిత్స ఉద్దేశం. రక్తపోటు అదుపు అతి ముఖ్యం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవడం అవసరం. కిడ్నీలు విఫలమైనప్పుడు డయాలిసిస్ అవసరమవుతుంది. ఇది రక్తంలోని వ్యర్థాలు, ఎక్కువమొత్తంలో ఉండే ద్రవాలను తొలగించటానికి ఉపయోగపడుతుంది. ఇందులో రెండు రకాల పద్ధతులున్నాయి. 

అత్యాధునిక వైద్యవిధానం.. 

కిడ్నీ సమస్యలు ఉన్నవారు భయపడాల్సిన పనిలేదు. బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసే అత్యాధునిక వైద్యవిధానం అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో ఏటా 2.20 లక్షల మందికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరమవుతుండగా కేవలం 7-8 వేలమందికి మాత్రమే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతున్నది. మన దగ్గర కెడావర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులో ఉన్నది.

చాలామంది రోగులకు వారి కుటుంబ సభ్యుల బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేసే పద్ధతినే ఏబీవో ఇన్‌కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు.    కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పుడు ఇతరుల కిడ్నీని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది డయాలిసిస్ నుంచి విముక్తి కలిగిస్తుంది. మరింత చురుకుగా జీవించడానికి తోడ్పడుతుంది. అయితే జీవితాంతం రోగనిరోధకశక్తిని కాపాడు కోవడానికి మందులు వాడుకోవాల్సి ఉంటుంది. 

 డాక్టర్ అరుణ్ కుమార్ దిండి, 

నెఫ్రాలజిస్ట్ 

మెడికవర్ హాస్పిటల్, హైదరాబాద్