19-05-2025 12:42:54 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలోని గిరిజనుల కోసం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.12,600 కోట్లతో చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని సోమవారం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2.10 లక్షల మంది గిరిజన రైతులకు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా పెట్టిస్తామని, రైతులకు 5,7.5 హెచ్పీ పంపుసెట్లు అందిస్తామని పేర్కొన్నారు. అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని, కరెంట్ పంపుసెట్లు తీసేసి సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సీఎం రైతులకు సూచించారు.
ప్రతి రైతుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల ఆదాయం ఉండాలని, అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లను వందరోజుల్లో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సౌర విద్యుత్పత్పితో గిరిజన రైతులు ఆదాయం పొందాలని, గిరిజనులకు కేటాయించిన భూముల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ఐఏఎస్ ను ప్రత్యేకాధికారిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.