01-07-2024 12:49:00 AM
న్యూఢిల్లీ: అద్వితీయ ఆటతీరుతో అప్రతీహత విజయాలు సొంతం చేసుకొని.. అజేయంగా టీ20 ప్రపంచకప్ చేజిక్కించుకున్న టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. కరీబియన్ దీవుల్లో ఉత్కంఠభరితంగా జరిగిన మెగాటోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి జగజ్జేతగా నిలిచిన భారత జట్టుకు.. బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి అందివ్వనుంది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు.
‘రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో పరాజయం ఎరగకుండా.. ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. తద్వారా విమర్శకుల నోళ్లు మూయించిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటిస్తున్నాం. టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ప్రదర్శన ముందుతరాలకు ఆదర్శం. ఈ ఆటతీరుతో వారు దిగ్గజాల సరసన చేరారు.
మెగాటోర్నీలో టీమిండియా కఠోర దీక్ష, నిరంతర కృషి, అంకితభావం, క్రీడాస్ఫూర్తి ప్రదర్వించింది. ఈ విజయంలో ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. 140 కోట్ల మంది ఆశలు నెరవేర్చిన భారత జట్టుకు మరోసారి శుభాకాంక్షలు’ అని జైషా వెల్లడించాడు.