01-07-2024 12:44:42 AM
* ఎవరు భర్తీ చేయగలరు మీ స్థానాన్ని.. ఎవరు పూరించగలరు ఈ ఖాళీని! ఆది నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచే శైలి ఒకరిదైతే.. పంతం పట్టి అంతం వరకు నిలిచే తెగువ మరొకరిది! సిక్సర్ల సునామీకి కేరాఫ్ అడ్రస్ ఒకరైతే.. కళాత్మకతకు పెట్టింది పేరు మరొకరు! ఆశలే లేని స్థితిలోనూ అరాచకం సృష్టించగల సత్తా ఒకరిదైతే.. ప్రత్యర్థి గణాంకాలను తారుమారు చేయగల దమ్ము మరొకరిది! ఒకటా, రెండా.. మీరిచ్చిన జ్ఞాపకాలను ఎన్నని గుర్తుపెట్టుకోగలం..
* జట్టుకు అవసరమైనప్పుడల్లా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోని సైనికుల్లా.. ప్యారాషూట్ లేకుండానే విమానంలో నుంచి దూకే డోగ్రా జవాన్లలా.. టీమిండియాకు పరాజయానికి మధ్య మీరెన్ని సార్లు అడ్డుగోడలా నిలబడ్డారో.. లెక్కేయడానికి మా అంకెల సామర్థ్యం చాలదు. మీరు మాకిచ్చిన విజయాలను గుర్తుపెట్టుకోవడానికి మా మది దొంతరలు చాలవు. పొట్టి ఫార్మాట్ ప్రారంభమైన తొలినాళ్ల నుంచే జట్టులో కీలక సభ్యుడిగా బాధ్యతలు మోసింది ఒకరైతే.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నట్లు చెలరేగిపోయింది మరొకరు. పుష్కరకాలంగా యావత్ భారతావని కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూసిన ఆ మధుర ఘట్టాన్ని సాక్షాత్కరించిన మీ ఇద్దరికీ ఏమివ్వగలం. అభిమానంతో ధన్యవాదాలు చెప్పడం తప్ప!
13 ఏళ్ల తండ్లాట తీర్చుతూ ప్రపంచ చాంపియన్ హోదా అందించిన సగర్వంగా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన యోధులారా మీకు సలాం!
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఇద్దరు వీరులపై ప్రత్యేక కథనం..
విజయక్రాంతి, ఖేల్ విభాగం :
గత టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌తో పోరులో పరాజయం పరిహాసమాడుతున్న వేళ.. సహచరులంతా వెనుదిరిగి డగౌట్ నుంచి బేలచూపులు చూస్తున్న సమయాన.. 3 ఓవర్లలో 48 పరుగులు చేయడం అసాధ్యమనిపించిన తరుణాన.. మెల్‌బోర్న్ మైదానంలో విరాట్ వీర గర్జనను ఏమని చెప్పగలం.. ఎంతని చెప్పగలం. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని చూసి.. కౌరవసేన వికటాట్టహాసం చేస్తున్నట్ల నిపించిన ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ వీరుడి తెగువ.. కురుక్షేత్రంలో అర్జునుడికి తక్కువేం కాదు!
తనకు తిరుగులేదని విర్రవీగుతున్న హరీస్ రవుఫ్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ.. కోహ్లీ బాదిన ఆ సిక్సర్లను వర్ణించేందుకు నిఘంటువుల్లోనే పదాలు లేవనడం అతిశయోక్తి కాదేమో! క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆ ఇన్నింగ్స్‌ను సగటు భారత క్రీడాభిమాని మరవగలడా! కొలతేసి కొట్టడమే తెలిసిన కోహ్లీ.. జట్టుకు అవసరమైన సమయంలో సిక్సర్లు సంధించగలడని నిరూపించిన ఆ క్షణం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతం. అదొక్కటేనా.. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటూ.. అతడాడిన ఇన్నింగ్స్‌కు విలువ కట్టగలమా! ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటా రెండా.. ఎన్నని చెప్పగలం.
ఏ ఇన్నింగ్స్ గురించి వర్ణించగలం. ఆడుతున్నది స్వదేశమా, విదేశమా అనే తేడా లేకుండా.. బౌలింగ్ చేస్తుంది పేసరా, స్పిన్నరా అనేదాంతో సంబంధం లేకుండా.. లైన్ బాలా, లెంగ్త్ బాలా అని ఆలోచించకుండా తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకపడే విరాట్ కోహ్లీ.. పొట్టి ఫార్మాట్‌లో తన ప్రస్థానాన్ని ముగించాడు. కెరీర్ ఆరంభం నుంచే అన్నీ ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నా.. టీ20 వరల్డ్‌కప్ సాధించలేదనే వెలితి వెంటాడుతుండగా.. కెరీర్‌లో చివరి మ్యాచ్‌లో చితక్కొట్టి సగర్వంగా బైబై చెప్పాడు.
టోర్నీ ఆసాంతం రాణించిన సహచరులు తుదిపోరులో విఫలమైన వేళ.. మరోసారి నాకౌట్ ఒత్తిడి జట్టుతో పాటు.. కోట్లాది మంది అభిమానులను దహించిన వేస్తున్న సమయాన.. విరాట్ ఆడిన సాధికారిక ఇన్నింగ్స్ గురించి పుస్తకం రాసినా తక్కువే. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆ యోధుడు ఆఖరాటలో తన అసలు సిసలు దమ్ముచూపాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు నేనున్నానంటూ వికెట్ల పతనానికి అడ్డుగా నిలిచిన విరాట్.. ఆచితూచి ముందడుగేశాడు.
మరో వికెట్ పడితే అసలుకే ఎసరువస్తుందని ముందే ఊహించినన కోహ్లీ.. తన వికెట్ కాపాడుకుంటూనే స్కోరుబోర్డును నడిపించాడు. ఇక పరవాలేదు అనేంత వరకు అతడు ఒక్క లూస్ షాట్ కూడా కొట్టలేదని.. విరాట్ తన వికెట్‌కు ఇచ్చిన విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. స్లాగ్ ఓవర్స్‌లో సిక్సర్లతో లెక్కసరి చేసి జట్టుకు మంచి స్కోరు అందించిన విరాట్.. ఫీల్డింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తూ వైదొలిగాడు. ఒక వైపు ప్రపంచకప్ దక్కిందనే ఆనందం. మరోవైపు వికెట్ పడితే బౌలర్ కంటే ఎక్కువ ఆనందపడే విరాట్‌ను ఇక పొట్టి ఫార్మాట్‌లో చూడలేమనే బాధ! యువతరానికి దారినిస్తూ టీ20లకు టాటా చెప్పిన కోహ్లీ నీకు ఇవే మా శుభాకాంక్షలు.
‘ముందుండి నడిపించే వాడే నాయకుడు’.. ఈ నానుడి రోహిత్ శర్మకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. మైదానం బయట ప్రతి విషయాన్ని మర్చిపోయే హిట్‌మ్యాన్‌కు.. గ్రౌండ్‌లో దిగిన తర్వాత ప్రతి చిన్న అంశాన్ని తీక్షణంగా పరిశీలించడం అలవాటు. పొట్టి ప్రపంచకప్‌నకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసనప్పటి నుంచి మొదలుపెడితే.. విరాట్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపడం.. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం.. దూబేపై విశ్వసం ఉంచడం.. ఇలా అతడు తీసుకున్న ప్రతీ నిర్ణయం ఆరంభంలో విమర్శలకు గురైందే. అయితే తాను నమ్మినదానికి కట్టుబడి ఉండటం.. సహచరుల్లో ఉత్సాహాన్ని నింపుతూ కలిసి నడవడం అసలైన సారథి అసలైన లక్షణమని రోహిత్‌ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఐసీసీ టోర్నీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసే విరాట్ కోహ్లీ.. ఈసారి ఫామ్ దొరకబుచ్చుకోలేక తంటాలు పడుతుంటే అతడికి అండగా నిలిచిన వ్యక్తితం రోహిత్‌ది. 2022 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ కంటే.. అది ముగిసిన తర్వాత విరాట్‌ను భూజాలకెత్తుకొని రోహిత్ ఆడిన వీరంగమే ఎక్కువ మందికి గుర్తుండి ఉంటుంది. తనకన్నా విరాటే గొప్ప ప్లేయర్ అని అందరి ముందు అంగీకరించగల గొప్పతనమే కాదు.. అతడు సరిగ్గా ఆడని సమయంలో అండదండగా నిలవడం కూడా హిట్‌మ్యాన్‌కే చెల్లింది. ఆ నమ్మకమే దక్షిణాఫ్రికాతో పైనల్లో స్పష్టమైంది.
నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత అభిమానుల ఆశలను వమ్ము చేసిన ఆస్ట్రేలియాను.. ఈ మెగాటోర్నీలో రోహిత్ చీల్చిచెండాడిన తీరు అత్యద్భుతం. ఆరంభంలోనే విరాట్ వెనుదిరిగినా.. ఏమాత్రం వెరవకుండా.. కంగారూలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన హిట్‌మ్యాన్.. కప్పుకు భారత జట్టుకు మధ్య ఉన్న ప్రధాన అడ్డంకిని సూపర్ అడ్డు తొలగించాడు. కింగ్ కోహ్లీ కళాత్మక కవర్‌డ్రైవ్ కంటే.. హిట్‌మ్యాన్ పుల్ షాట్‌కే ఎక్కువ మంది అభిమానులున్నారనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు! ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దశాబ్దానికి పైగా భారత జట్టు భారాన్ని భూజాల మీద మోసిన ఇద్దరు మేరు నగధీరులు పొట్టి ఫార్మాట్‌కు బైబై చెప్పగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో కొత్తతరం ఇదే స్ఫూర్తిని ముందుకు సాగించాలని ఆశిద్దాం!
‘నిండు కుండ తొణకదు’ అన్నట్లు.. మిన్ను విరిగి మీద పడుతున్నా.. ఏమాత్రం చలించకుండా.. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో తనకు తానే ఓ ఆదర్శమైన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. చిన్న పిల్లాడిలా మారిపోయాడు! కప్పు చిక్కిన కాసేపటికి విరాట్ కోహ్లీ ట్రోఫీని తీసుకొచ్చి ద్రవిడ్ చేతికందించినప్పుడు.. ఇన్నాళ్లుగా అందని అపురూప వస్తువు దరిచేరడంతో రాహుల్ భావోద్వేగాలను బయటపెట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 500 పైచిలుకు మ్యాచ్‌లు 24 వేల పైచిలుకు పరుగులు చేసిన ద్రవిడ్.. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడి సగర్వంగా హెచ్ కోచ్ పదవికి వీడ్కోలు పలికాడు.
రాహుల్ ద్రవిడ్ ఘనంగా గుడ్‌బై
బ్రిడ్జ్‌టౌన్: భారత పొట్టి క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. టీ20 ప్రపంచకప్‌లో విశ్వ విజేతగా నిలిచిన అనంతరం కెప్టెన రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. ఇన్నాళ్లు జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ కూడా ఇక సెలవు చెప్పేశాడు. వాస్తవానికి నిరుడు స్వదేంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌తోనే ద్రవిడ్ పదవీ కాలం ముగిసినా.. పొట్టి ప్రపంచకప్‌నేపథ్యంలో ఈ టోర్నీ వరకు కొనసాగాడు. కొత్త కోచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు చేస్తుండగా.. వరల్డ్ చాంపియన్ జట్టుకు కోచ్‌గా ద్రవిడ్ ఇంటిబాట పట్టాడు.
సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు పెట్టని గోడగా నిలిచిన ద్రవిడ్.. ప్లేయర్‌గా వరల్డ్ చాంపియన్ అనిపించుకోలేకపోయినా.. కోచ్‌గా ఆ కీర్తికిరీటాన్ని సాధించాడు. కెరీర్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచే.. యువక్రికెటర్లను సానబెట్టే పనిలో మునిగిపోయిన ద్రవిడ్.. భారత్ అండర్ జట్టు కోచ్‌గా, జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్‌గా వివిధ బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం టీమిండియా ప్రధాన శిక్షకుడిగా ఎంపికయ్యాడు. స్టార్లతో నిండిన భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడమంటే.. కత్తి మీద సాములాంటిదని ముందే గుర్తించిన ద్రవిడ్ ఆరంభంలో విముఖత చూపినా.. సహచరుడు, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రోద్బలం మేరకు ఆ బాధ్యతలు భూజానెత్తుకున్నాడు.
అదేం అల్లాటప్పా పని కాదని తెలిసిన ద్రవిడ్ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతూ ప్రపంచ కప్పు ముద్దాడాడు. నిజానికి నిరుడు వరల్డ్‌కప్‌లోనే భారత జట్టు చాంపియన్‌గా నిలవాల్సింది కానీ.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో కల చెదిరింది. అయినా అధైర్యపడని ద్రవిడ్.. పొట్టి ఫార్మాట్‌లో తన కల నెరవేర్చుకొని సగర్వంగా విశ్రాంతికి ఉపక్రమించాడు.