04-11-2025 07:06:25 PM
జిల్లా పశువైద్య అధికారి డా. వెంకటేశ్వర్లు..
మణుగూరు (విజయక్రాంతి): మండలంలోని రాయిగూడెం, సాంబయిగూడెం, పాత మణుగూరు గ్రామాలలో మంగళవారం మండల పశువైద్య అధికారి డా. సరస్వతి ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య అధికారి డా. వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని సూచించారు.
గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని, పశువులకు ఒకదాని నుండి మరొకదనికి సంక్రమిస్తుందన్నారు. వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టలని, వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది ప్రతాప్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ వీరభద్రం, రైతులు పాల్గొన్నారు.