22-07-2025 12:37:08 AM
కరీంనగర్, జూలై 21(విజయక్రాంతి):ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 494 ఆవాసాల పరిధిలో ఉన్న 12 లక్షల మంది దాహం తీరుస్తున్న ఎల్ ఎం డి జలాశయం అడగంటితే రాబోయే మూడు నెలలు తాగునీటికి ఇబ్బంది తప్పవు. తాగు నీటిని రోజు విడిచి రోజు కూడా సరఫరా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 885 ప్రకారం ఎల్‌ఎండీలో 12 టీఎంసీల నీటిని నిత్యం నిల్వ ఉంచాలి కానీ అమలుకు సాధ్యం కాని పరిస్థితి.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, గతేడాది డిసెంబర్ 31 నాటికి 22.870 టీఎంసీల దిగువ ఆయకట్టుకు యాసంగికి నీరు అందించారు. ఖమ్మం, సూర్యాపేట వరకు తరలించారు. ఈ వర్షాకాలం వర్షాలు లేక జలాశయంలో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. సోమవారం నాటికి కేవలం 6.094 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది.
గత ఏడాది ఇదే తేదీ నాటిక 5.41 టి ఎం సి లు మాత్రమే ఉండే అయితేమిడ్ మానేరు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం జూలై చివరి వారం నుండి జోరు వానలు కురిటడంతో ఇబ్బందులు తోలగిపోయాయి. . ఈ ఎడాది మిడ్ మానేరు లో కేవలం 6 టి ఎం సి లు ఉండటంతో ఎల్ ఎం డి కి నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఉంది.
నిజా నికి ఎల్‌ఎండీ జలాశయం 2.096 డెడ్ స్టోరేజీ కాగా, ఇప్పుడున్న 6.094 టీఎంల్లో డెడ్ స్టోరేజీపోను 4 టీఎంసీ నీరు మాత్రమే ఉంటుంది. దీనిని బట్టి చూస్తే వచ్చే మూడు నెలలు తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎల్‌ఎండీ జలాశయం నుంచి 3 సెగ్మెంట్లకు తాగు నీటిని అందిస్తున్నారు. అందులో కరీంనగర్- రామడుగు సెగ్మెంట్ను పరిశీలిస్తే 87, ఎల్‌ఎండీ, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్ పరిధిలో 312, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి సెగ్మెంట్ పరిధిలో 70 చొప్పున మొత్తం 469 ఆవాసాలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో విలీనమైనవి మరో 25 కలిపి మొత్తం 494 ఆవాసాలు ఉన్నాయి.
వీటి పరిధిలో ప్రతి రోజు 143 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. అందులో ఒక్క కరీంనగర్కే 63 క్యూసెక్కులు అవసరం. అయితే, ఎల్‌ఎండీకి యాసంగి నీటి ప్రణాళికలో భాగంగా మిషన్ భగీరథకు 3.852 టీఎంసీలు కేటాయించాలని నిర్ణయించారు. కానీ, ఈరోజు వరకే చూస్తే డెడ్ స్టోరేజీ పోను 4 టీఎంసీలు మాత్రమే ఉన్నది. అందులో ప్రతి రోజూ 115 క్యూసెక్కులు ఆవిరి కింద తీసేస్తే తాగు నీటికి లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. వర్షాలు కురియకుంటే మరింత నీటి మట్టం పడిపోయి తాగు నీటికి తీవ్ర ఇక్కట్లుతప్పవు.