calender_icon.png 22 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పొంచి ఉన్న వరద ముప్పు!

22-07-2025 12:34:41 AM

నష్ట నివారణ చర్యలు శూన్యం 

మహబూబాబాద్, జూలై 21 (విజయ క్రాంతి): భారీ వర్షాలు కురిస్తే వచ్చే వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు, వరద ఉధృతికి దెబ్బతినే ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురిసి మునుపెన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. చెరువులు, కుంటల కట్టలు తెగిపోయి వరద ఉధృతితో పలుచోట్ల రైల్వే ట్రాక్ వరదలకు కొట్టుకుపోవడం, అనేకచోట్ల రోడ్లు తెగిపోయి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

కాజీపేట విజయవాడ రైల్వే సెక్షన్లో ఇంటికన్నె - తాల్లపూస పల్లి రైల్వే స్టేషన్ల మధ్య పలుచోట్ల రైల్వే ట్రాక్ వరదలకు కొట్టుకుపోవడంతో ఐదు రోజులపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే విధంగా మహబూ బాబాద్ - మరిపెడ, కురవి - ఖమ్మం, మహబూబాబాద్ - వరంగల్ మార్గంలో పలు చోట్ల రోడ్ల వంతెనలు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించింది. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు సందర్శించారు. వరద ఉధృతి వల్ల నష్టపోయిన వారికి అప్పట్లో పరిహారం కూడా అందజేశారు.

అయితే భవిష్యత్తులో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని,  వరద నీరు వెళ్లే నాలాల్లో ఆక్రమణలను తొలగించాలని, ఇరుకుగా మారిన వంతెనలను విస్తరించాలని, ఇందుకోసం ఆ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే అప్పట్లో నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చెప్పిన ఆదేశాల ప్రకారం నాలాల ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. అలాగే జిల్లావ్యాప్తంగా లో లెవెల్ కాజ్ వే, ఇరుకు కల్వర్టులను గుర్తించారు.

పలుచోట్ల దెబ్బతిన్న బ్రిడ్జిలకు తాత్కాలిక రిపేర్లు నిర్వహించారు. అయితే పూర్తి నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నాలాలపై ఆక్రమణలను తొలగించకపోవడం, పలుచోట్ల కల్వర్టులను విస్తరించకపోవడం, ఇంకా జిల్లావ్యాప్తంగా కొన్ని దెబ్బతిన్న బ్రిడ్జిలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ఈ వర్షాకాలంలో మళ్లీ వరదలు వస్తే గత ఏడాది పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గత ఏడాది భారీ వర్షాల వల్ల నష్టపోయిన పరిస్థితిని ఈసారి తిరిగి తలెత్తకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం ఆయా శాఖల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూర్, కేసముద్రం పట్టణాల్లో వరద ఉధృతి వల్ల దెబ్బతినే ప్రాంతాలను అధికారులు గత ఏడాది గుర్తించినప్పటికీ, నష్ట నివారణ చర్యలు ఒక్కటి కూడా చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి. కేసముద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద రైల్వే అండర్ డ్రైనేజీ ఇరుకుగా మారడం, అమరవీరుల స్థూపం వద్ద కల్వర్టు చిన్నదిగా నిర్మించడం వల్ల వరద ఉధృతి దిగువకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

అలాగే మహబూబాబాద్ పట్టణంలో సిగ్నల్ కాలనీ వద్ద ఎగువ నుంచి వచ్చే వరద నీరు నీరుగా దిగువకు వెళ్లకుండా నిలిచిపోతుండడంతో వర్షాకాలంలో ఆ ప్రాంతమంతా ముంపుకు గురై మళ్లీ ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అలాగే తొర్రూరు పట్టణంలో ప్రధాన రోడ్ల లో వరద నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బంది కలిగే పరిస్థితి అలాగే ఉంది. డోర్నకల్ పట్టణంలో కొర్లకుంట కాలువ పూర్తిగా పొదలతో నిండిపోయి వరద నీరు దిగువకు సులువుగా వెళ్లక పలు ప్రాంతాల్లోని వీధుల్లో నీరు చేరే పరిస్థితి. వరద నీరు ప్రవహించే నాలాలను పట్టించుకోకపోవడం వల్ల ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురిస్తే ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పటికైనా అధికారులు స్పందించి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన వరద నీరు దిగువకు వెళ్లే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో గత ఏడాది మాదిరిగానే భారీ వర్షాలు కురిస్తే వరదలు పొంగి ప్రవహించడం వల్ల రైల్వే, రోడ్డు రవాణా స్తంభించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలకు తీవ్ర నష్టం కలిగించక తప్పదని చెబుతున్నారు.