calender_icon.png 15 September, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరెత్తిన లండన్ వీధులు

15-09-2025 01:49:15 AM

-ఏకకాలంలో రెండు వర్గాల నిరసనలు

-పోలీసులపై దాడులు చేసిన ఆందోళన కారులు

-‘యునైటెడ్ ది కింగ్‌డమ్’తో పాటు ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ పేర నిరసనలు

-మద్దతు తెలిపిన మస్క్

-తీవ్రవాద నిరసనలకు బ్రిటన్ ఎప్పటికీ తలవంచదు: ప్రధాని స్టార్మర్

లండన్, సెప్టెంబర్ 14: లండన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. ఏకకాలంలో రెండు వర్గాలు నిరసనలు చేస్తూ వీధుల్లోకి రావడంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు కష్టమైంది. వలసలకు నిరసనగా దాదాపు లక్ష మంది బ్రిటన్ పౌరులు రోడ్లపైకి రాగా.. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసనలో ఐదు వేల మంది వరకూ పాల్గొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న టామీ రాబిన్సన్ నేతృత్వంలో ‘యునైటెడ్ ది కింగ్‌డమ్’ పేర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అదే సమయంలో స్టాండ్ అప్ టు రేసిజం సంస్థ ఆధ్వర్యంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన చేపట్టారు. ఈ రెండు వర్గాల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రెండు వర్గాల నిరసనకారులను చెదరగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. నిరసనకారులు పోలీసులపైకి వాటార్ బాటిళ్లు విసిరేశారు. ఈ ఆందోళనల్లో 26 మంది అధికారులు గాయపడగా, 24 మంది నిరసనకారులు అరెస్ట్ అయినట్టు సమాచారం. జాతీయ జెండా చాటున హింసను ప్రేరేపించే తీవ్రవాద నిరసనకారులకు బ్రిటన్ ఎప్పటికీ తలవంచదని ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. 

వలసలతో బ్రిటన్ నాశనం: మస్క్

వలసలతో బ్రిటన్ నాశనం అవుతోందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు. యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీపై ఆయన స్పం దించారు. ‘భారీగా అనియంత్రితంగా వస్తు న్న వలసలతో బ్రిటన్ నాశనం అవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే హింస మరింత పెరిగి సామాన్యుల వద్దకు చేరుతుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాలి. ప్రజలు హక్కులు కాపాడుకోవాలి. పోరాడండి.. లేకపోతే చనిపోతారు’ అని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అంతే కాకుండా బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు జరగాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు.