20-08-2025 12:00:00 AM
-భవనం పూర్తయి 6 నెలలు గడిచినా పట్టించుకోని ప్రభుత్వం
-నంగునూరు మండలం గట్ల మల్యాలలో వృధాగా రూ.2 కోట్ల పీహెచ్‌సీ భవనం
నంగునూరు, ఆగస్టు 19:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హ యాంలో మంజూరైన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాంత ప్రజలు సబ్ సెంటర్లో అందుబాటులో ఉన్న పరిమిత సేవలతోనే కాలం వెళ్ళదీస్తున్నారు.
మారుమూల ప్రాంతాల్లో సైతం నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చొరవతో పీ.హెచ్.సీ మంజూరు చేశారు. నిర్మాణమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభిస్తే గ్రామం తో పాటు సమీప గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
సబ్ సెంటర్లో పి.హెచ్.సీ సేవలు...
గట్లమల్యాలలోని సబ్ సెంటర్ లో పి.హెచ్.సీ సేవలందిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం గ్రామానికి పి.హెచ్.సీ మంజూ రైంది. భవనం లేకపోవడంతో తాత్కాలికంగా సబ్ సెంటర్ లో వైద్య సేవలు ప్రారం భించారు. భవనం నిర్మాణం పూర్తయిన ప్రారంభించకపోవడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో పి హెచ్ సీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదు. ఈ కేంద్రంలో కేవలం గర్భిణులు, ఆరు నెలల లోపు పిల్లలకు టీకాలు ఇస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రతి మంగళ, శుక్రవారలలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 104 రకాల వైద్య పరీక్షలు, 201 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. పాము కాటుకు, కుక్క కాటుకు అవసరమయ్యే ఏఆర్వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ సరిపడ గదులు లేకపోవడంతో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం కష్టంగా మారింది.
ఖాళీగా ఉన్న పోస్టులతో సవాళ్లు
సబ్ సెంటర్లో ముఖ్యమైన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టు ఖాళీగా ఉంది. దీనివల్ల కొన్ని సేవలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను నంగునూరులోని సీహెచ్సీకి లేదా సిద్దిపేటకు తరలించాల్సి వస్తోంది. ఇది ప్రజలకు ఆర్థికంగా, శారీరకంగా భారంగా మారింది. ఈ పోస్టును వెంటనే భర్తీ చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిధుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్
రూ. 57 లక్షలతో ప్రహరీ గోడ, ఫర్నిచర్ వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఈ పనులకు సంబంధించిన నిధులు ఇంకా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. గతంలో చేసిన పనుల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నందున, సొంత ఖర్చులతో పనులు కొనసాగించలేకపోతున్నను. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే మిగతా పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పగిస్తామనీ కాంట్రాక్టర్ తిప్పని రమేష్ తెలిపారు.
పీహెచ్సీతో మరిన్ని ప్రయోజనాలు
పూర్తిస్థాయి పీహెచ్సీ ప్రారంభమైతే వైద్య సిబ్బంది సంఖ్య పెరిగి, వైద్య సేవలు మెరుగుపడతాయి. గట్లమల్యాల గ్రామం తోపాటు ఖాతా, ఘనాపూర్, కొండంరాజుపల్లి, అక్కనపల్లి, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఐదు గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ దవఖానా త్వరితగతిన ప్రారంభమైతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే నిధులు విడుదల చేసి పీహెచ్సీని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.