calender_icon.png 3 January, 2026 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్ల పంచాయితీకి పరిష్కార కమిటీ

03-01-2026 12:29:49 AM

  1. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వం 
  2. కమిటీలో ఇరురాష్ట్రాల అధికారులు

హైదరాబాద్, జనవరి 2(విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైంది. నీటి కేటాయింపుల్లో సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో సభ్యులుగా రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు కూడా సభ్యులుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు అధికారుల చొప్పున చోటు కల్పించింది.

కమిటీలో తెలంగాణ నుంచి సాగునీటి, జల వనరుల సలహాదారు, సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సెక్రెటరీ, ఈఎన్సీ, ఏపీ నుంచి జల వనరుల స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సలహాదారు, ఈఎన్సీ, చీఫ్ ఇంజినీర్, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ చీఫ్ ఇంజినీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ సభ్యులుగా ఉన్నారు.

అయితే గత జూలై 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటుచేసి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నదీ జలాల వివాదాల పరిష్కార కమిటీని నియమించింది. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.