28-01-2026 12:07:31 AM
ఏర్పాట్లను పూర్తి చేసిన ఉత్సవ కమిటీ
18 రోజులపాటు జరగనున్న జాతర
రాష్ట్రం నలుమూలల నుంచి తరలి రానున్న భక్తులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 27: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మి నర్సింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యా యి. మాఘశుద్ధ ఏకాదశి నుంచి బహుళ త్రయోదశి వరకు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నేటి నుంచి(బుధవారం) ఉత్సవాలు మొదలై ఫిబ్రవరి14 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న స్వామివారి కల్యాణోత్సవం, 3న రథోత్సవం, 5న పొన్నోత్సవంతో పాటు వివిధ ఉత్సవాలను18 రోజులపాటు నిర్వహించనున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానున్నారు. గత ఉత్సవాల మాదిరిగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
దాతల సహకారంతో పనులు..
ఆలయంలో రుద్రంగి కిరణ్ కుమార్ రూ.10 లక్షలతో హనుమాన్ మండపాన్ని ఇప్పటికే నిర్మించారు.కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి అమెరికాకు చెందిన ఎన్నారైలు డాక్టర్ యోగానంద్, డాక్టర్ నర్సింహారావు ఇద్దరు సోదరులు రూ.15లక్షలతో తిరుకళ్యాణ మండపాన్ని నిర్మించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.3 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం కూడా జరిగింది.
ఫిబ్రవరి 14న స్వామి ఉత్సవమూర్తులను జాజిరెడ్డిగూడెంలోని దేవాలయానికి తీసుకెళ్లడంతో బ్రహ్మోత్సవాల ప్రక్రియ పూర్తికానుందని,వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ ఈఓ వై శ్రీనివాస్ రెడ్డి,ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డిలు కోరారు.
వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం
నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాతల సహకారంతో ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాము. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.
అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్