28-01-2026 12:08:07 AM
గత పదేళ్లుగా ప్రజల గోడును పట్టించుకోలేదు
ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ సాయికుమార్
హైదరాబాద్, జనవరి 27(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, వారు ‘కల్వకుంట్ల’ రాజ్యాంగం’ అమలు చేశారని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సాయికుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్‌ఎస్ అంటే ‘బహిష్కరణ రాష్ట్ర సమితి’ అని, గత పదేళ్లుగా తెలంగాణ ప్రజల గోడును పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతల అబద్ధాలు రామకోటితో సమానమని, 2034 వరకు రేవంత్ రెడ్డి నామస్మరణ చేస్తేనే వారి పాపాలు పోతాయని ఎద్దేవా చేశారు. రవీంద్ర భారతి తర్వాత నాటకాలకు తెలంగాణ భవన్ సిద్ధంగా ఉందని, అక్కడ బీఆర్‌ఎస్ నేతలు నాటకాలే వెయ్యాలని, వాటికి హరీశ్ రావు, కేటీఆర్ కర్త కర్మ క్రియ లని సాయికుమార్ వ్యాఖ్యానించారు.