calender_icon.png 21 January, 2026 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్బీఐ నుంచి త్వరలో తక్కువ ధరకే క్లౌడ్ సేవలు

19-11-2024 12:00:00 AM

ముంబై: క్లౌడ్ సర్వీసుల విషయంలో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల గుత్తాధిపత్యం కొనసాగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త తరహా ఆలోచనతో సిద్ధమవుతోంది. తక్కువ ధరకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డాటా స్టోరేజీ సదుపాయాన్ని అందించేందుకు గానూ క్లౌడ్ స్టోరేజీ సేవలను వచ్చే ఏడాది పైలట్ ప్రాతిపదికన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇందుకోసం స్థానిక ఐటీ సంస్థల సేవలను వినియోగించుకోనుంది. తద్వారా క్లౌడ్ విభాగంలో ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రో సాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్, ఐబీఎం క్లౌడ్ వంటి సంస్థల ఆధిపత్యానికి చెక్ పెట్టనుంది. వచ్చే ఏడాది పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ క్లౌడ్ డేటా స్టోరేజీ సేవలను ప్రారంభించనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. తర్వాత దశలవారీగా విస్తరించనున్నారు.

ప్రస్తుతం ఉన్న క్లౌడ్ సేవలను వినియోగించుకోవడానికి ఇబ్బంది పడుతున్న చిన్న బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ డాటా సేవలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా గతంలో ఈ ప్రతిపాదన గురించి ప్రస్తావించారు. ఒక కేంద్ర బ్యాంక్ ఈ తరహా సేవలు తీసుకొస్తుండడం ఇదే తొలిసారి.