మైసమ్మ తల్లి, మడేలయ్య బోనాల మహోత్సవం
కరీంనగర్: ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఆనవాయితీగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించడం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయమని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో ఆదివారం 53వ డివిజన్ లో మైసమ్మ బోనాలు, 33వ డివిజన్ లో మడేలయ్య బోనాల జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై బోనమెత్తారు. 53వ డివిజన్ లో గోదాంగడ్డ మైసమ్మ దేవాలయంలో 33వ డివిజన్ భగత్ నగర్ మడేలయ్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... నగరంలో ప్రతి ఏటా ప్రజలు గ్రామ దేవతలుగా కొలిచే పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెదమ్మ తల్లి అమ్మవార్లకు బోనాలతో మొక్కలు చెల్లించుకోవడం గత పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీ అన్నారు. ఇందులో భాగంగానే నగర వ్యాప్తంగా ప్రత్యేక ఆషాఢమాసంలో వివిధ వర్గాల ప్రజలు తమ తమ ఇష్టదేవతలకు బోనాలు చేసి పెద్ద ఎత్తున జాతర చేయడం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ప్రజలు బోనాలతో మొక్కులు చెల్లించుకొని చల్ల చూడాలని దేవతలకు మొక్కుబడులు చెల్లిస్తారని అన్నారు. ఈ బోనాల మహోత్సవం లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కు బడులు చెల్లించుకున్నట్లు తెలిపారు. అమ్మవార్ల ఆశీస్సులతో నగర ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తూ... కొరిన కోర్కెలు నెరవేరాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పోరేటర్ తుల శ్రీదేవి చంద్రమౌళి, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.




