28 April, 2026 | 3:24 AM

శ్రీ చైతన్య కాలేజీలో భారీ దొంగతనం

28-04-2026 01:55 AM

కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 27(విజయక్రాంతి): నగరంలోని మంకమ్మతోట ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో జరిగిన భారీ దొంగతనం కేసును కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఛేదించారు.ఈ కేసులో పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్ (32)ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.5 లక్షల నగదు మరియు 10 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, దుర్షెడ్ గ్రామానికి చెందిన యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష కూడా అనుభవించాడు.

జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు.ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామున యుగేందర్ మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అక్కడ బీరువాలో దాచి ఉంచిన రూ.5 లక్షల నగదు, ఒక బంగారు గొలుసును అపహరించాడు. అనంతరం ఆ సొత్తును తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు.నమ్మదగిన సమాచారం ఆధారంగా టూ టౌన్ సీఐ కె. సృజన్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం నిందితుడిని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

పంచుల సమక్షంలో అతను దాచిన నగదు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.విచారణలో భాగంగా, నిందితుడు గతంలో చింతకుంట ఆంజనేయస్వామి గుడిలో హుండీ దొంగతనానికి కూడా పాల్పడినట్లు అంగీకరించాడు. నేరస్తులపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సృజన్ రెడ్డి హెచ్చరించారు.సకాలంలో నిందితుడిని పట్టుకుని సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.