24-10-2025 12:00:00 AM
ఇల్లెందు, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేసేందుకు ప్రతి సిపిఐ కార్యకర్త గడపగడపకు సిపిఐ నినాదంతో సభను జయప్రదం చేసేలా ప్రజలను కార్యకర్తలను సభలో పాల్గొనే విధంగా చూడాలని సిపిఐ రాష్ట్ర నాయకులు, కంట్రోల్ కమిషన్ సభ్యులు మిర్యాల రంగయ్య అన్నారు.
గురువారం విఠల్ రావు భవనంలో మంచాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఇల్లందు మండల పట్టణ సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు మిరియాల రంగయ్య, కె. సారయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు నియోజవర్గంలోని ప్రతి మండలం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలించేందుకు వాహనాలను సమకూర్చుకునేందుకు నాయకత్వం దృష్టి సారించాలన్నారు.
5 లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు దేశంలోని నలుమూలల నుండే కాకుండా ప్రపంచంలోని 40 దేశాల నుండి ప్రజా ప్రతినిధులు హాజరవుతారన్నారు. నియోజవర్గంలో ప్రజలందరికీ తెలిసేలా సిపిఐ శతాబ్ది ఉత్సవాల వాల్ రైటింగ్స్ రాయించాలని తెలిపారు. సిపిఐ సానుభూతిపరుల నుండి నిధులు సమీకరణ చేసి డిసెంబర్ 26న జరిగే ముగింపు సభకు ఇల్లందు నియోజకవర్గ నుండి సిపిఐ కార్యకర్తలు, ప్రజలను 30 వేలకు పైగా తరలించాలన్నారు.
నియోజవర్గంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ సభకు తరలి వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంధం నాగయ్య, ఇల్లందు మండల పట్టణ కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, బాస శీను, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు దాసరి రాజారాం, గిరిజన సమైక్య రాష్ట్ర నాయకులు గుగులోత్ కృష్ణ, బొల్లి కొమరయ్య, కుమ్మరి రవీందర్, బసిపాక రవి, చాట్ల గణపతి, తాండ్ర లక్ష్మీనారాయణ,షేక్ వలి, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.