24-10-2025 01:01:35 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ‘పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు రాయలసీమకు, రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగకరం కాదు. నీరు ఎత్తిపోసి మళ్లీ.. కిందకు ఎవరైనా పారబోస్తారా? ఇది అత్యంత లోపభూయిష్టమైన పథకం. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఉన్న హక్కులకు తీవ్ర ప్రమాదం తెచ్చిపెట్టే పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచించాలి’ అని ఆంధ్రప్రదేశ్ ఆలోచనాపరుల వేదిక ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.
పోలవరం లింక్ ప్రాజెక్టుపై పక్కన ఉన్న తెలంగాణ, ఒడిశా, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో గుడ్డిగా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో పోలవరంబనకచర్లపై సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఏపీలోని జల వనరులను సక్రమంగా వినియోగించుకోవడంపై గురువారం ఏపీ ఆలోచనాపరుల వేదిక ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వర్‌రావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి.లక్ష్మీనారాయణ, నలమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సాయి ప్రసా ద్‌ను కలిసి ఇందుకు సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.
రూ.82 వేల కోట్ల ఖర్చు..
శ్రీశైలం జలాశయం వద్ద నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తితే సహజ ప్రవాహం (గ్రావిటీ) ద్వారా 16.5 కి.మీ దూరంలోని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు కృష్ణా నీళ్లు వస్తాయని వారు ప్రభు త్వానికి గుర్తిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం నుంచి బనకచర్లకు భారీ ఎత్తిపోతల ద్వారా సోమశిల రిజర్యాయర్‌కు చేర్చ డం రాయలసీమకుగానీ.. రాష్ట్రానికి గానీ ఏమాత్రం ఉపయోగకరం కాదంటూ వేదిక విశ్లేషించింది.
పైగా దీనికోసం 4,500 మెగావాట్ల విద్యుత్తు అవసరమని, ఈ పథకానికి అయ్యే ఖర్చు రూ.82,000 కోట్లు అని ప్రభుత్వమే చెప్పడాన్ని ప్రతినిధులు ఎత్తిచూపారు. వాస్తవానికి శ్రీశైలం జలాశయం దిగువ భాగంలో ఏర్పడిన లోతైన గొయ్యి (ప్లంజ్‌ఫూల్)పై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీ ఆలోచనాపరుల వేదిక స్పష్టం చేసింది. దీనికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, తద్వారా శ్రీశైలం ఆనక ట్టుకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించినట్టవుతుందని వారు పేర్కొన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఒక పెద్ద కందకం, దాని చివరలో ఓ బావి తవ్వడానికి ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.750 కోట్లు ఖర్చు చేసిందని వారు దుయ్యబట్టారు. ఇంకో రూ.3,000 కోట్లు ఖర్చు చేసే ఆ ఆలోచన సరైంది కాదని పేర్కొంది. ఇదే అభిప్రాయాన్ని రాయలసీమకు చెందిన ఒక ప్రముఖ రిటైర్డ్ ఇంజనీరు బృందం కూడా వ్యక్తంచేసినట్టు వేదిక ప్రతినిధులు ఏపీ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి స్పష్టం చేశారు.