calender_icon.png 24 October, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్ రిజ్వీతో మంత్రి జూపల్లికి విభేదాలు!

24-10-2025 01:05:02 AM

గతంలో డిప్యూటీ సీఎం భట్టి.. రిజ్వీకి మధ్య అంతర్గత వార్

రిజ్వీకి వీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వొద్దంటూ  మంత్రి జూపల్లి రాసిన లేఖలో బయటిపడిన లుక లుకలు  

భట్టితో మంత్రి జూపల్లి భేటీ 

అబ్కారీ శాఖలో రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ వ్యవహార శైలిపై చర్చ 

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకో రగడం జరుగుతోంది. నిన్న, మొన్నటి వరకు మంత్రుల మధ్య జరిగిన వార్ మరువకముందే ఇప్పుడు మంత్రి, ఒక సీనియర్ ఐఏఎస్ మధ్య వివాదం బయటికి రావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ సయ్యద్‌అలీ ముర్తజా మధ్య నెలకొన్న వివాదం ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.

అంతకు ముందు కూడా రిజ్వీ విద్యుత్ సంస్థల (ట్రాన్స్‌కో, జెన్‌కో) సీఎండీగా ఉన్నప్పుడు డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మధ్య వివాదం జరిగింది. ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ ను చూస్తున్న భట్టి.. ఆ సమయంలో విద్యుత్ శాఖలో భట్టి తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలను సైతం రిజ్వీ పట్టించుకోలేదనే విమ ర్శలు ఉన్నాయి. దీంతో విద్యుత్ సంస్థల సీఎండీ పదవి నుంచి ప్రభుత్వం తప్పించి అబ్కారీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.

ఇప్పుడు తాజాగా అబ్కారీ శాఖ లో మరో వివాదం తెరపైకి రావడంతో.. రిజ్వీ వ్యక్తిగత కారణాలు చూపుతూ వీఆర్‌ఎస్ తీసుకోగా, రిజ్వీ అవినీతిపరుడైన అధి కారి అని ఆయనపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖ బహిర్గతమైన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నాయి.   

ప్రజాభవన్‌లో భేటీ

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రజాభవన్‌లో గురువారం మం త్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. రిజ్వీ పై రాసిన లేఖ, తాజా పరిణామాలపై మంత్రి జూపల్లి వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సుజ్ కమిషనర్ హరికిరణ్ తమ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిగా తన ఆదేశాలను ఎక్సుజ్ కమిషనర్ కూడా పట్టించుకోలేదని భట్టికి వివరిచినట్లు సమాచారం. అయితే జూపల్లి, రిజ్వీల మధ్య నెలకొన్న పంచాయితీని బీఆర్‌ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది.

కాంగ్రెస్ నేతలు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారంటూ కేటీఆర్ ఈ అంశంపై స్పందిస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా బెదిరిస్తున్నారంటూ విమర్శలు చేయడం, అలాగే రిజ్వీ నిజాయితీపరుడంటూ  కేటీఆర్ సర్టిఫికెట్ సైతం ఇవ్వడాన్ని ధీటుగా బదులివ్వాలని కాంగ్రెస్ శ్రేణులు ఆలోచనలో ఉన్నాయి.  కాగా, రాష్ట్రంలో ఎక్సైజ్ హోలోగ్రామ్ టెండర్ల వ్యవహారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రిజ్వీ మద్య నలుగుతూ వస్తోంది.

తన ఆదేశాలు అమలు చేయని రిజ్వీపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 22న సీఎస్ రామకృష్ణారావుకు ఫిర్యాదు లేఖను రాశారు. 2013 నుంచి 21 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోనే ఈ హోల్ గ్రామ్ టెండర్ల ఒప్పందం కుదిరింది. కొత్త సాంకేతితలతో మరింత భద్రమైన లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. అయితే మంత్రి ఆదేశాలను అబ్కారీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రిజ్వీ పట్టించుకోకుండానే..

పాత వారికే మళ్లీ అవకాశం కల్పించారని, అంతే కాకుండా చట్ట విరుద్ధంగా క్యాప్రికార్న్ బ్లెండర్స్ నుంచి రూ.6.15 కోట్లు డిమరేజ్ చార్జీలను వసూలు చేశారని సీఎస్‌కు రాసిన లేఖలో మంత్రి పేర్కొన్నారు. వీటితో పాటు ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి, గరిష్ట అమ్మకం ధరల విషయంలో అసాధారాణ జాప్యంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలిగిందని, ఎంపీ డిస్టలీరీ విషయంలో ఎల్‌ఓఐ (లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్) జారీ చేయాలని ఆదేశించిన పట్టించుకోలేదని, బ్లూసీల్ వైనరీ విషయంలో మేనేజ్‌మెంట్ తప్పులేదని అనుమతులు ఇవ్వాలని మంత్రిగా తాను ఆదేశించినా..

మంత్రికి నిబంధనలు సడలించే అధికారం లేదని సీఎంవోకు ఫైల్ పంపడం వల్ల సీఎంవోపై అదనపు భారం పడుతోందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. కొన్ని లిక్కర్ సంస్థలకు సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి రాష్ట్ర ఖజానాకు రూ.223 కోట్ల నష్టంవాటిల్లేలా అబ్కారీ కమిషనర్ వ్య వహరించారని జూపల్లి లేఖలో పేర్కొన్నారు.