05-12-2024 04:21:09 PM
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. నిన్న రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో తాము చాలా బాధపడ్డామని తెలిపింది. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని మైత్రీ మూవీ మేకర్స్ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అన్ని విధాలుగా మద్దతు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. అల్లు అర్జున్ హాజరైన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ థియేటర్‌లో జనాల తొక్కిసలాటలో ఊపిరాడక రేవతి (35) అనే మహిళ విషాదకరంగా ప్రాణాలు కోల్పోగా, ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ (9) తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన భారీ చిత్రం పుష్ప2 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.