05-12-2024 04:01:31 PM
16 పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం
హైదరాబాద్: హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సచివాలయంలో శ్రీధర్ బాబు తెలంగాణకు వస్తున్న పెట్టుబడులపై మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకం ఏదైనా బాగుంటే దాన్ని కొనసాగిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రాభివృద్ది, ప్రజల సంక్షేమం విషయంలో తమకు భేషజాలు ఉండవని తెలిపారు. టీజీఐపాస్ ద్వారా రూ. 6347 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, కొత్త పెట్టుబడులతో 35,724 మందికి ఉపాధి కలిగిందని మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో కొత్తగా 16 పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామన్న శ్రీధర్ బాబు ప్రాజెక్టుల ద్వారా రూ. 14, 433 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా 8,894 మందికి అదనపు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. ఫార్మా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తున్నాం.. ఫార్మా రంగంలో రూ. 34 వేల కొట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో డెంగ్యూ వ్యాక్సిన్ కూడా ఇక్కడే తయారువుతుందని మంత్రి వెల్లడించారు. జీన్ థెరపీకి సంబంధించిన సంస్థ కూడా తెలంగాణకు రాబోతోందని శ్రీధర్ బాబు తెలిపారు. హెల్త్ కేర్ కు సంబంధించి తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిందని మంత్రి పేర్కొన్నారు.