calender_icon.png 4 February, 2026 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది నూతన భారతదేశం.. దెబ్బ కొట్టి తీరుతుంది!

04-02-2026 12:00:00 AM

బాలీవుడ్‌లో నిరుడు డిసెంబర్‌లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిం చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంజయ్‌దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘ధురంధర్ 2: ది రివేంజ్’ రాబోతోంది. తొలిభాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1,320 కోట్ల సంచలన వసూళ్లు రాబ్టటింది. దీంతో పార్ట్ అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ధురంధర్2’ టీజర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. టీజర్‌తోపాటు ‘అబ్ బిగడ్నే కా వక్త్ ఆ గయా హై’ అనే క్యాప్షన్‌తో ఓ కొత్త పోస్టర్‌ను సైతం టీమ్ సోషల్‌మీడియాలో పంచుకుంది.

ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ టీజర్‌లో రణ్‌వీర్ పోషిస్తున్న హమ్జా అలీ మజారీ పాత్ర యవ్వనంలోని జీవితాన్ని చూపించారు. పాకిస్థాన్‌లోని ల్యారీ టౌన్‌ను శాసించే ఓ క్రూరమైన గ్యాంగ్‌లో అతను ఎలా ఎదిగాడో, స్పైగా మారకముందు అతని నేపథ్యం ఏమిటో తెలియజేస్తోందీ టీజర్. టీజర్ చివరలో ‘ఇది నూతన భారతదేశం. సరిహద్దులు దాటి చొరబడుతుంది.. దెబ్బ కొట్టి తీరుతుంది’ అంటూ రణ్‌వీర్ చెప్పే డైలాగ్ ఆకర్షణీయంగా ఉంది. ఇక ఈ సీక్వెల్‌ను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇదే టీజర్ ద్వారా ప్రకటించారు. తొలి భాగం కేవలం హిందీలోనే విడుదల కాగా, రెండో భాగాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్, ఆదిత్యధర్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.