calender_icon.png 14 September, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైటాన్స్ దశ మార్చిన ‘మాలిక్’

01-12-2024 12:19:25 AM

కబడ్డీలో ఆట ఎంత ముఖ్యమో.. ఎత్తుగడలు కూడా అంతే ముఖ్యం. అలాంటి ఎత్తుగడలు లేకే తెలుగు ప్రతి సీజన్ చతికిలపడిపోతుంది. ఫస్టాఫ్‌లో రెచ్చిపోయినా సరైన ఎత్తుగడలు లేక ప్రత్యర్థి ముందు తలవంచుతోంది. కానీ ఈ సారి ఆల్‌రౌండర్ ‘విజయ్ మాలిక్’ రాకతో ఆ లోటు తీరిపోయింది. 

హైదరాబాద్: 11వ సీజన్ తెలుగు టైటాన్స్ దశ మారింది. స్టార్ రెయిడర్ పవన్ షెరావత్ రాణించినా కానీ జట్టును సరైన విధంగా కంట్రోల్ చేస్తూ ఏ సమయంలో ఎలా వ్యవహరించాలనే స్ట్రాటజీలు లేక ఇన్నాళ్లూ చతికిలపడిపోతూ వస్తున్న తెలుగు టైటాన్స్‌కు ఈ సారి ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ దొరకడమే కాకుండా జట్టును కామ్‌గా కంట్రోల్ చేసే విలువైన ఆటగాడు కూడా లభించాడు.

దీంతో ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతోంది. ఆడిన 15 మ్యాచుల్లో తొమ్మిదింట విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. స్టార్ రెయిడర్, కెప్టెన్ పవన్ షెరావత్‌కు తోడు ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ అవసరం అయిన సమయాల్లో పాయింట్లు సాధిస్తూ తన ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వస్తున్నాడు. 

యోధాస్ నుంచి.. 

సీజన్ 11 కోసం జరిగిన వేలంలో యూపీ యోధాస్ నుంచి తెలుగు టైటాన్స్ విజయ్ మాలిక్‌ను రూ. 20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ అతడు తన విలువేంటో చూపిస్తున్నాడు. పవన్ షెరావత్ రాణించినా రాణించకున్నా కానీ జట్టు మీద పెద్దగా ప్రభావం పడకుండా చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన మాలిక్ 126 పాయింట్లు సాధించి తెలుగు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

విజయ్ మాలిక్ కేవలం రెయిడర్‌గా మాత్రమే కాకుండా డిఫెండర్‌గా కూడా అదరగొడుతూ వస్తున్నాడు. గత కొద్ది మ్యాచ్‌లుగా కెప్టెన్ పవన్ షెరావత్ ప్లేయింగ్ సెవెన్‌లో ఉండకపోయినా కానీ ఆ ప్రభావం మాత్రం తెలుగు టైటాన్స్ గెలుపు మీద పడడం లేదంటే అది విజయ్ మాలిక్ చలవే.