మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలి

26-04-2024 12:10:00 AM

కాంగ్రెస్ మ్యానిఫెస్టో న్యాయపత్’్ర వివరిస్తా

మా మ్యానిఫెస్టో గురించి మీకు తప్పుడు సమాచారం

మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలకు మీరే కారణం

ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం నడుస్తోంది. సంపద పునఃపంపిణీ, మంగళసూత్రం, వారసత్వ పన్ను మొదలైన విషయాలను లేవనెత్తుతూ కాంగ్రెస్‌ను మోదీ ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నా రు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఖర్గే మోదీకి లేఖ రాశారు. ‘ఈ మధ్య సభల్లో మీ భాష విని నేనేమీ ఆశ్చర్యపోలేదు. మీరిచ్చే ప్రసంగాలకు మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లు చూసి మోసపోకండి. మీ మాటలతో నిరాశ, నిస్పృహలకు గురైన కోట్లాది ప్రజల అభిప్రాయాలను మీ వరకు చేరనివ్వడం లేదు. మా మ్యానిఫేస్టోలో చేర్చని అంశాల గురించి మీ సలహాదారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మా న్యాయపత్రాన్ని మీకు వివరించేందుకు మీరు నాతో వ్యక్తిగతంగా భేటీ అయితే సంతోషిస్తాను. ఒక దేశ ప్రధానిగా మీరు తప్పుడు ప్రకటలు చేయొద్దు’ అని లేఖలో ఖర్గే పేర్కొన్నారు. 

మణిపూర్ దాడులకు మీరే బాధ్యులు

‘మీరు కార్పొరేట్ రంగంలోని వ్యక్తుల కోసం పనిచేస్తోంది. వారి పన్నులు తగ్గించారు. వారు రీఫండ్స్ పొందుతున్నారు. మరోవైపు ఉద్యోగులు ఎక్కువగా పన్నులు కడుతున్నారు. నిత్యవసర వస్తువులపై పేదలు జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే మేము పేదవారి గురించి మాట్లాడుతున్నాం. మీరేమో హిందూ ముస్లింల ప్రస్తావన తెస్తున్నారు. మీరు మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన దాడులకు మీ ప్రభుత్వం కారణం కాదా? రేపిస్టులకు పూలదండలు వేసి సన్మానించలేదా?’ అని పేర్కొన్నారు.