30-09-2025 12:53:13 AM
అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆరోపణ
ఎల్బీనగర్, సెప్టెంబర్ 29 : దసరా పండుగ వేళ వలస కుటుంబంలో విషాదం నెలకొంది. హయత్ నగర్ డివిజన్ లోని కమర్షియల్ టాక్స్ కాలనీలో ఒక వ్యక్తి బతుకమ్మ పూలు తేవడానికి వెళ్లి... చెట్ల చాటున ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి మృతి చెందిన ఘటన సోమవారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన సుర్కంటి అశోక్ రెడ్డి(50) ఉపాధి కోసం కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం హయత్ నగర్ డివిజన్ లోని కమర్షి యల్ టాక్స్ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ కోసం పూలు తేవడానికి సోమవారం ఉదయం సమీపంలో ఉన్న ప్రదేశానికి వెళ్లాడు.
పూలు తెంపుతున్న సమయంలో చెట్ల చాటున ఉన్న తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడి ఊపిరి ఆడక మృతి చెందాడు. సాయంత్రం అయినా అశోక్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, పరిసర ప్రాంతాల్లో వెదుకుతున్నారు.
సెప్టిక్ ట్యాంక్ ను. పరిశీలించగా, అశోక్ రెడ్డి కనిపించాడు. స్థానికుల సహాయంతో అశోక్ రెడ్డిని బయటకు తీయగా, అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలి....
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ వేర్వేరుగా మాట్లాడుతూ... అధికారుల నిర్లక్ష్యమే అశోక్ రెడ్డి మృతికి కారణమన్నారు. రెండు సంవత్సరాలుగా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవ స్థను బాగు చేయాలని కోరారు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.