calender_icon.png 30 September, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమరం షురూ..

30-09-2025 01:53:06 AM

  1. షెడ్యూల్ విడుదల
  2. రిజర్వేషన్లతో నేతల ఆశలు తారుమారు

మహబూబాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ సోమవారం నుండి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కౌముదిని రాణి ప్రకటించారు. మొదట జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

దీనితో గ్రామాల్లో దసరా పండుగ నుండి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. అయితే పలుచోట్ల రిజర్వేషన్లు అనుకూలంగా రాలేదని, ఇంకొన్ని చోట్ల రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా నిర్వహించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ సీరోల్ మండలంలో చింతపల్లి ఎంపీటీసీ స్థానాన్ని రద్దుచేసి ఎంపిటిసి స్థానంలో విలీనం చేశారని, ఇది సరైన పద్ధతి కాదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని, ఎన్నికల్లో పోటీ చేసి విజయం  సాధించాలని లక్ష్యంతో చాలామంది గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలకు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో తాము ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లేకుండా పోయిందని లో లోపల కుమిలిపోతున్నారు. అనుకున్నది ఒక్కటి అయింది ఇంకొకటి అన్న చందంగా రిజర్వేషన్లు తలరాతలను తారుమారు చేశాయని, మరో ఐదేళ్లపాటు స్థానిక ఎన్నికల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలామంది నేతలు వాపోతున్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ కు కేటాయించినప్పటికీ, జిల్లాలోని జనరల్ కేటగిరీకి జిల్లాలోని గార్ల జెడ్పిటిసి స్థానాన్ని జనరల్ కు కేటాయించగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఆశించే ఇతర మండలాల నేతలు అక్కడికి వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇంతకాలం ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. 

మహబూబాబాద్ జిల్లాలో జడ్పిటిసి స్థానాల రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి మహబూబాబాద్: బీసీ జనరల్, బయ్యారం: బీసీ మహిళ , చిన్న గూడూరు: ఎస్సీ జనరల్, దంతాలపల్లి ఎస్సీ మహిళ, డోర్నకల్ ఎస్టీ: జనరల్ , గంగారం : జనరల్, జనరల్ , గార్ల : జనరల్, మహిళ , గూడూరు: బీసీ జనరల్, ఇనుగుర్తి :ఎస్టి మహిళ,  కేసముద్రం: ఎస్టీ మహిళ, కొత్తగూడ: బీసీ జనరల్, కురవి: ఎస్టి మహిళ , మరిపెడ :బిసి మహిళ,  నర్సింహులపేట: ఎస్టి జనరల్, నెల్లికుదురు: బిసి జనరల్, పెద్దవంగర ఎస్సీ జనరల్, సిరోలు: ఎస్టీ జనరల్,తొర్రూరు: బిసి మహిళకు కేటాయించారు.

ఎంపీపీ రిజర్వేషన్ల వివరాలు ఇలా..

మహబూబాబాద్ జిల్లాలో మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

బయ్యారం: బీసీ మహిళ, చిన్న గూడూరు: ఎస్టీ జనరల్, దంతాలపల్లి: ఎస్సీ మహిళ డోర్నకల్: ఎస్టీ జనరల్, గంగారం: జనరల్, గార్ల: జనరల్ మహిళ, గూడూరు: బీసీ జనరల్, ఇనుగుర్తి: ఎస్టి మహిళ, కేసముద్రం: ఎస్టీ మహిళ కొత్తగూడ: బీసీ జనరల్, కురవి: ఎస్టి మహిళ, మహబూబాబాద్: బీసీ జనరల్ , మరిపెడ:  బీసీ మహిళ, నర్సింహులపేట: ఎస్టి జనరల్, నెల్లికుదురు: బీసీ జనరల్, పెద్దవంగర: ఎస్సీ జనరల్ , సిరోల్: ఎస్టీ జనరల్, తొర్రూరు: బీసీ మహిళ కు కేటాయించారు.

ఇలా కట్టారో లేదో.. అలా ఫ్లెక్సీల తొలగింపు..!

సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని గ్రామాల్లో రాజకీయ పార్టీల నేతలు సోమవారం ఫ్లెక్సీలను విపరీతంగా ఏర్పాటు చేశారు. అయితే వారి సంతోషం కొంతసేపు కూడా నిలవకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని ఉదయం పూట జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల నేతల ఫ్లెక్సీలను సాయంత్రం షెడ్యూలు వెలబడగానే పంచాయతీ సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. దీనితో నేతలు అయ్యో అంత ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేయిస్తే క్షణకాలం కూడా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. 

చింతపల్లిని యధావిధిగా కొనసాగించాలి 

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలోని చింతపల్లి ఎంపీటీసీ స్థానాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో కురవి మండలంలో ఉన్న సమయంలో తమ గ్రామం ఎంపీటీసీ స్థానంగా ఉండేదని, కొత్తగా సీరోల్  మండలంలో తమ ఎంపీటీసీ స్థానాన్ని విలీనం చేసి ఇప్పుడు, ఎంపీటీసీ స్థానాన్ని తొలగించడం సరైంది కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి ఎంపీటీసీ స్థానాన్ని యధావిధిగా  కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.