calender_icon.png 30 September, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న నీటివనరులపై దృష్టి

30-09-2025 01:56:26 AM

  1. స్థానిక ఎన్నికల తర్వాత సాగునీటి సంఘాల ఏర్పాటు
  2. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు తలుపుతడతాం
  3. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  4. చేవెళ్ల డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : చిన్న నీటివనరులైన చెరువులు, కుంటలు, కాలువల సంరక్షణపై సర్కార్ దృష్టిసారించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు సాగునీటి సంఘాల ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. తాజా భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలకు గండ్లు పడటం, కాలువలు తెగిపోవడం వంటి అంశాలతోపాటు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్, ఎత్తు పెంచడం, సీతారామ, చనాక-కొరటా, సీతమ్మ సాగర్, మోదికుంట వాగు అనుమతులతోపాటు ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన  సమీక్షా సమావే శంలో మంత్రి మాట్లాడారు.

రైతు నష్ట పోవద్దన్నదే ప్రభుత్వ సంకల్పం

చెరువులు, కుంటలు, కాలువల భద్రతపై అధ్యయనం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్ట పోవద్దన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడటంతో పా టు సాగునీటి అంశంలో ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలు గా సాగునీటి సంఘాల ఏర్పాటును పరిశీలనలోకి తీసుకున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సాగునీటి సంఘాల ఏర్పాటు ఉండేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.

చిన్న నీటి చెరువుల పరిరక్షణ నిమిత్తం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసిన పక్షంలో క్రమంగా భారీ నీటి తరహా ప్రాజెక్టులను విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. సాగునీటి సంఘంతో లష్కర్ తదితర సిబ్బంది, నీటిపారుదల శాఖ ఆపరేషన్ అం డ్ మెయింటెనెన్స్ విభాగంతో కలిసి పని చేసేలా సమన్వయం చేయగలిగితే.. సత్ఫలితాలు సాధిస్తామని  మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తంచేశారు.

మొత్తం ఈ సంఘాలకు సంబంధిత డిప్యూటీ ఇంజనీర్ కన్వీనర్‌గా వ్యవహరించేలా విధి విధానాలు ఉంటాయని తెలిపారు. 1997 నాటి నీటి వనరుల అభివృద్ధి సంస్థ రూపొందించిన చట్టం ప్రకారమే సాగునీటి సంఘాలకు కాలువల నిర్వహణ, నీటి పంపిణీ, చెరువుల పరిరక్షణ బాధ్యత ఉంటుందన్నారు.  

నిర్వహణతో పాటు భద్రత బాధ్యత

సాగునీటి నిర్వహణతో పాటు చెరువులు, కుంటలు, కాలువలకు భద్రత కలిపించేందు కు సాగునీటి సంఘాలకు బాధ్యత ఉండేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సాగునీటి సంఘాల్లో రైతుల ప్రాతినధ్యం కోసం తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, కమిషన్ సభ్యుల సమన్వయంతో సాగునీటి సంఘాలను నామినేట్ చేసే విధంగా ప్రతిపాదనలు సి ద్ధం చేస్తున్నామన్నారు.

కర్నాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెం పుపై సుప్రీంకోర్టు తలుపుతడతామని మం త్రి చెప్పారు. చట్టపరమైన పోరాటానికి సిద్ధం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనుమతులు పెండింగులో ఉన్న సీ తారామ, చనాక సీతమ్మసాగర్, మోదికుంటవాగు వంటి ప్రాజెక్టుల అనుమతులను తెచ్చుకునే పనులు వేగవంతం చే యాలని మంత్రి సూచించారు. అలాగే తు మ్మిడిహట్టి వద్ద నిర్మించనున్న చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మంత్రివర్గం ఆమోదించిన తరువాత ఎస్‌ఎల్‌బీసీ పనులను పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. చిన్న కాళేశ్వరం, కల్వకు ర్తి, దేవాదుల ప్యాకేజీ తదితర ప్రాజెక్టుల  అంచనాలపై మంత్రివర్గం ఆమోదం తీసుకోను న్నట్టు  పేర్కొన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్ర త్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ పాల్గొన్నారు.

రాజకీయ లబ్ధికోసమే అబద్ధాలు 

రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాజెక్టులపై అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ దుయ్యబట్టారు. కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  ఆల్మట్టి ఎత్తు పెంచవద్దని సుప్రీంకోర్టు స్టే ఉందని, డ్యామ్ ఎత్తు పెంచేందుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని, ఇందుకోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో వాదనలకు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించినట్టు తెలిపారు.