30-09-2025 07:39:15 PM
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతి పెద్ద బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని, అధికారులను అభినందించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో రాష్ర్ట పర్యాటక శాఖ ప్రతిష్ఠించిన నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద సంప్రదాయ నృత్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది.
గిన్నిస్ రికార్డే లక్ష్యంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు నెలలుగా 63 అడుగుల ఎత్తయిన బతుకమ్మను రూపొందించారు. ఒకేసారి 1,354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ రెండూ కూడా గిన్నిస్ రికార్డును సాధించాయి. ఈ నేపథ్యంలో మంత్రి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.