calender_icon.png 5 September, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నీడలో మంథని..

04-09-2025 11:25:10 PM

వినాయక నిమజ్జనం వేడుకలకు  వేళాయె..

గోదావరి తీరంలో భద్రతా చర్యలను పరిశీలించిన మంథని సీఐ రాజు..

మంథని (విజయక్రాంతి): వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా మంథని నియోజకవర్గంలో గణనాథుల నిమజ్జన వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంథని గోదావరి వద్ద నిమజ్జన వేడుకలకు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) ఆదేశాల మేరకు మంథని సీఐ రాజు గౌడ్ గురువారం గోదావరి తీరం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మంథని పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ముత్తారం, కమాన్ పూర్, రామగిరి మండలాల నుంచి ఉత్సవ విగ్రహాలను మంథని మీదుగా గోదావరి నది వద్దకు తరలించేందుకు రూట్ మ్యాప్ ను పరిశీలించారు.

ఊరేగింపు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు బిగించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పసిగట్టేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున వినాయకుల నిమజ్జనాలకు చిన్నారులను తీసుకురాకుండా చూసుకోవాల్సిన బాధ్యత  ఉత్సవ కమిటీలపై ఉందని సీఐ సూచించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, వేలం పాటలు  పూర్తిచేసుకుని  నిర్దేశిత సమయంలోనే  ఉత్సవ విగ్రహాలను నిమజ్జనంకు తీసుకురావాలని సూచించారు. తొమ్మిది రోజులపాటు ఎంత భక్తిశ్రద్ధలతో కొలిచారో... నిమజ్జన వేడుకల్లో కూడా అంతే ఆధ్యాత్మికత, ప్రశాంతతను ప్రదర్శించాలని, వేడుకలు ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ కమిటీలు, భక్తులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మంథని మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఎస్ఐ రమేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి, నాయకులు పాపారావు తదితరులు పాల్గొన్నారు.