calender_icon.png 7 September, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర

04-09-2025 11:22:08 PM

- బందోబస్తులో 350 మంది...

- నిమజ్జన ప్రాంతాల గుర్తింపు...

- రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా 

మంచిర్యాల, (విజయక్రాంతి) : జిల్లాలో వినాయక నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత, బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిఘా నీడలో శోభాయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) వెల్లడించారు. గురువారం జిల్లాలోని తాండూర్, మంచిర్యాల, ఇందారం వద్ద గల గోదావరి బ్రిడ్జ్, గోదావరి తీరం వెంట నిమజ్జననం జరిగే ప్రదేశాలను, శోభయాత్ర రూట్ ప్రదేశాలను కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖ ల అధికారులతో కలిసి సందర్శించారు. 

బందోబస్తుకు పోలీసులు...

మంచిర్యాల జిల్లాలో భక్తులు 2,334 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, వీటి నిమజ్జనం, శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బందోబస్తు కోసం ముగ్గురు ఏసీపీలు, 11 మంది సీఐ, ఆర్ఐలు, 28 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 175 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుళ్లు, 65 మంది హోంగార్డులు, 30 మంది ఏఆర్,స్పెషల్ పార్టీ సిబ్బంది, 40 మంది ట్రాఫిక్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, క్యాడెట్లు ఉంటారన్నారు. నిమజ్జన శోభాయాత్రను డ్రోన్ కెమెరా సహాయంతో పర్యవేక్షిస్తామని, ఎక్కడైనా వాహనాల మూమెంట్, ట్రాఫిక్ సమస్య ఎదురైతే వెంటనే పరిష్కరిస్తామన్నారు. 

నిమజ్జన ప్రాంతాలు ఇవే...

జిల్లాలో వినాయక నిమజ్జనాలకు సంబందించి పాయింట్లను గుర్తించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కువగా విగ్రహాలు దండేపల్లి మండలం గూడెం - రాయపట్నం బ్రిడ్జి వద్దకు వెళతాయని, అలాగే లక్షెట్టిపేట గోదావరి పుష్కర ఘాట్, మంచిర్యాల గౌతమేశ్వర ఆలయం, సీతారాంపల్లి ఇంటెక్ వెల్, ఇందారం గోదావరి బ్రిడ్జి, చెన్నూర్ పెద్ద చెరువు, బెల్లంపల్లి పోచమ్మ చెరువుల్లో పెద్ద మొత్తంలో వినాయక నిమజ్జనం జరుగుతుందని, ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు పికెట్లు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మత్తు, ప్లడ్ లైట్లు, క్రేన్లు, ఫ్లాట్ ఫామ్స్, మంచినీటి వసతి ఏర్పాటు చేశామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్ల అందుబాటులో ఉంటారన్నారు. 

గణేష్ ఉత్సవ కమిటీలు త్వరిత గతిన పూజలు ముగించి వెలుతురు ఉండగానే తమ విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని సూచించారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. ఊరేగింపులో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.