19-10-2025 08:48:52 PM
కాటారం (విజయక్రాంతి): అక్రమంగా గంజాయిని సేవిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు కాటారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కాటారం మండలం పోతుల్వాయి శివారులో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించారని, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
కిష్టంపేట గ్రామానికి చెందిన సుతారి శ్రీకాంత్, కమలాపూర్ గ్రామానికి చెందిన ఎండి సోహెల్ ను అరెస్టు చేయగా, మద్దులపల్లి గ్రామానికి చెందిన మేకల అజయ్ అనే వ్యక్తి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు. దొరికిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని వారి వద్ద నుండి 1.570 కేజీల గంజాయిని, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఇతర ప్రదేశాలలో గంజాయి కలిగి ఉన్నా, విక్రయించినా సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.