26-12-2025 06:38:38 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట్ మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రానున్న డిసెంబర్ 30న హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా నిర్వహించనున్న ముదిరాజ్ సర్పంచుల సన్మాన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ముఖ్య అతిథిగా హాజరైన ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ ఆవిష్కరించారు.
అనంతరం మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులకు జిల్లా అధ్యక్షులు బట్టు విఠల్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముదిరాజ్ వర్గాన్ని బీసీ (D) నుంచి బీసీ (A) లోకి మార్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ సన్మానసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ముదిరాజ్ వర్గానికి చెందిన ప్రతి సర్పంచ్, నాయకుడు, బంధువు ఈ సభకు తప్పనిసరిగా హాజరై జాతి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
సర్పంచులు తెలివిగా, చురుకుగా వ్యవహరించినప్పుడే గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని జిల్లా అధ్యక్షులు బట్టు విఠల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల పునర్నిర్మాణంలో సర్పంచుల పాత్ర మరింత కీలకంగా మారిందని,గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే బాధ్యత కొత్తగా ఎన్నికైన సర్పంచుల భుజస్కంధాలపై ఉందన్నారు. అధికారాలతో పాటు సంకల్పబలం, నాయకత్వం ఉంటేనే ప్రజలను ఐక్యం చేసి ముందుకు నడిపించగలమన్నారు. అధికార, ప్రతిపక్ష తేడాలు లేకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ గ్రామాభివృద్ధిపై సంపూర్ణ దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
గ్రామాభివృద్ధి దేశాభివృద్ధికి ముడిపడి ఉందని, ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. ప్రతి గ్రామం ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుని గ్రామసభలలో ప్రజల అభిప్రాయాలతో అమలు చేయాలని సూచించారు. నిధుల సమీకరణలో కొత్త మార్గాలు అన్వేషించాలి. గ్రామం నుంచి ఎదిగి వచ్చిన దాతల సహకారం పొందాలి, గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తులను ఆధునీకరించి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల పట్ల సమదృష్టితో వ్యవహరించాలన్నారు. నీటి సంరక్షణ,వన సంరక్షణ, పంటలు, చెరువుల ద్వారా గ్రామ ఆదాయం పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. గుడి, బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రుల సంరక్షణతో పాటు గ్రామాన్ని మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి వంటి విష సంస్కృతుల నుంచి కాపాడాల్సిన బాధ్యత సర్పంచులదేనన్నారు. మహిళలు, యువత గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.