calender_icon.png 20 December, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు

20-12-2025 09:20:20 PM

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై స్కూలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఇన్స్పెక్షన్ ప్యానల్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇన్స్పెక్షన్ ప్యానల్ టీం సభ్యులు ప్రతి పాఠశాలను సందర్శించి అవసరమైన అంశాలపై నివేదిక రూపొందించి అందించాలని తెలిపారు. పాఠశాలలలో విద్యుదీకరణ, త్రాగునీరు, ప్రహరీ గోడ, వంటశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం పోషక విలువలతో మధ్యాహ్న భోజనం అమలు, ప్రతి పాఠశాలకు ఆటస్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల తొలగింపుకు రహదారులు భవనాల శాఖ అధికారులతో నివేదికలు అందించాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు 100 శాతం హాజరు ఉండేలా పర్యవేక్షించాలని, ఉపాధ్యాయుల బోధన విధానం, విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను తమ నివేదికలో పొందుపరిచి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మానిటరింగ్ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఇన్స్పెక్షన్ ప్యానెల్ టీం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.