calender_icon.png 16 August, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

16-08-2025 08:56:43 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మత్తు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామానికి వెళ్లే రహదారి పైన ఉన్న లో లెవెల్ వంటేనకు ఇరువైపులా కోతకు గురైన రహదారిని పరిశీలించి పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మద్దు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత రాత్రి నుండి ఉదయం వరకు జిల్లాలో భారీ వర్షం కురిసినందున వాగులు, ఒర్రెలు ఉతృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరు దాటే ప్రయత్నం చేయకూడదని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు.

వ్యవసాయదారులు చేనులలో, పశువుల కాపరులు పశువుల మీదకు అడవికి వెళ్లకూడదని, నెలలు నిండిన గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు, ఆసుపత్రిలోని బర్త్ వెయిట్ సెంటర్లకు తరలించాలని తెలిపారు. ప్రజల తక్షణ సహాయం కొరకు సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ నం. 8500844365 లో సంప్రదించవచ్చని తెలిపారు. జన జీవనానికి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో వాగులు,  కాజ్ వే ల వద్ద పోలీస్, రెవెన్యూ, పంచాయితీ రాజ్ సిబ్బందితో సహారా ఏర్పాటుచేసి అటువైపుగా ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారిని రక్షించడానికి ఎస్. డి. ఆర్. ఎఫ్. బృందాలు సిద్ధంగా ఉన్నాయని, శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని గుర్తించి వారికి పునరావాసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగుపై గల వంతెనను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, ఓర్రేలు, కాజ్ వే లు, వంతెనలపై నుండి వరద నీరు ప్రమాదకరంగా నిర్వహిస్తుందని, ప్రజలు, వాహనదారులను ఎట్టి పరిస్థితులలో అటువైపు వెళ్లకుండా అధికారులు బందోబస్తు చర్యలు తీసుకోవాలని, వరద ప్రవాహ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాల సూచన ఉన్నందున గ్రామాలలో పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు తెలిసే విధంగా టామ్ టామ్ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, తహసిల్దార్ రియాజ్ అలీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.