calender_icon.png 3 May, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరుకే మెడికల్ కాలేజీలు!

24-04-2025 02:24:36 AM

  1. కొత్త మెడికల్ కాలేజీల్లో సమస్యల దరువు
  2. స్వీపర్లు లేక అడ్డాకూలీలతో శానిటేషన్ పనులు
  3. ఫ్యాకల్టీ కొరతపై ఇప్పటికే నోటీసులు అందించిన ఎన్‌ఎంసీ
  4. ల్యాబ్‌లు కొరతతో మెరుగైన విద్య ఎలా సాధ్యమంటున్న విద్యార్థులు
  5. దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాల్లో 5వ స్థానంలో తెలంగాణ
  6. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలోనూ నిపుణుల కొరత

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పేదలకు మరింత మెరుగైన వైద్యం కోసం ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని, జనాభాపరంగా దేశంలోనే అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్‌వన్ అంటూ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నా.. వాస్తవంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కాలేజీల్లో కనీసం పారిశుధ్య పనులు చేసేందుకు స్వీపర్లు కూడా లేకపోవడంతో బయటినుంచి అడ్డాకూలీలను తీసుకొస్తున్నారు. దీనిపై అనేకసార్లు సంబంధిత ప్రిన్సిపల్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పురాలేదు.

ఇంతేకాదు కనీసం 20శాతం ఫ్యాకల్టీ కూడా లేరని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు లేమి, ల్యాబ్‌ల కొరత వెరసి చదువుకునేందుకు ఏమాత్రం వీలులేకుండా ఉందని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

అడ్డాకూలీలే దిక్కు..

ఫ్యాకల్టీ సంగతి దేవుడెరుగు కనీసం శానిటేషన్ పనులు చేసేందుకు కూడా సిబ్బందిని ఇవ్వలేదని, ఫలితంగా రోజు అడ్డా మీద కూలీలను తీసుకువచ్చి వారితో ఈ పనులు చేయిస్తున్నామని కొత్తగా ఏర్పాటైన ఓ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ‘విజయక్రాంతి’కి తెలిపారు. ‘మా వద్ద కనీసం 20శాతం కూడా ఫ్యాకల్టీ లేరు..ల్యాబులు లేవు..సరైన బడ్జెట్ లేదు..మా సమస్యలను ఎన్నిసార్లు హెల్త్ డీఎంఈకి, సెక్రటరీకి విన్నవించినా ఫలితం లేదు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, అందులో 4,290 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో కొత్తగా ఏర్పాటైన గద్వాల, ములుగు, నారాయణపేట, నర్సంపేట, కుత్బుల్లాపూర్, మెదక్, భువనగిరి, మహేశ్వరం మెడికల్ కాలేజీల్లో  ఒక్కో కాలేజీకి 50 సీట్ల చొప్పున 400 సీట్లు ఉన్నాయి. అయితే సరైన ఫ్యాకల్టీ లేకుండానే కాలేజీలను నడుపుతున్నారంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ప్రభుత్వానికి నోటీసులు పంపింది. త్వరలోనే సర్దుబాటు చేస్తామంటూ అధికారులు ఎన్‌ఎంసీకి అఫిడవిట్ దాఖలు చేశారు. 

కాలేజీలు అధికం..సౌకర్యాలు శూన్యం

10 లక్షల మందికి 238 సీట్లతో మెడికల్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లతో ముందంజలో ఉంది. తెలంగాణలో 65 మెడికల్ కాలేజీలు ఉండగా..36 ప్రభుత్వ ఆధీనంలో, 29ప్రైవేట్ ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 4,290, ప్రైవేటు కాలేజీల్లో 4,750 మొత్తం 9,040 సీట్లున్నాయి. కాలేజీలు ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా..కనీసం సదుపాయాలు, ఫ్యాకల్టీ నియామకంపై కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరముంది. 

సూపర్ వైద్యం అందకుండా..

ఉస్మానియా, గాంధీవంటి సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీల్లో అత్యుత్తమ ప్రొఫెసర్లను వారి సేవలను వినియోగించుకునే స్థాయి లేని కొత్త మెడికల్ కాలేజీలకు పంపించారు. ఫలితంగా ఇక్కడ జరగాల్సిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు, ఇతర మేజర్ సర్జరీలు చేసేందుకు వైద్యుల కొరత ఏర్పడింది.

పోనీ వారు బదిలీ అయిన చోట అయినా వారి సేవలు ఉపయోగపడుతున్నాయా అంటే అక్కడ కనీసం ల్యాబులు కూడా లేవు. అలాంటి చోట సర్జరీలు, అవయవమార్పిడి చికిత్సలు ఎలా ఆశిస్తారని కొందరు ప్రొఫెసర్లు ‘విజయక్రాంతి’కి చెప్పడం గమనార్హం.

వచ్చే నెలలో పదోన్నతుల ద్వారా భర్తీ

డీఎంఈ ఫ్యాకల్టీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగం. అయితే అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు పదోన్నతుల ద్వారా పూర్తి చేస్తాం. మొదటి దశలో వచ్చే నెలలో అసోసియేట్, ప్రొఫెసర్ పదోన్నతులు చేపడతాం. అదనంగా దాదాపు 1,300పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నాం.

తద్వారా రెండు నెలల్లోగా ఫ్యాకల్టీ లోపం లేకుండా చేస్తాం. ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ సేవలు (శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ మొదలైనవి) ప్రస్తుతం టీవీవీపీ కాంట్రాక్ట్ ద్వారా కొనసాగుతున్నాయి. ఇందుకోసం త్వరలోనే డీఎంఈ తరఫున కొత్త టెండర్లు పిలుస్తాం. మెడికల్ కాలేజీల్లో ఇబ్బందులు లేకుండా చూస్తాం. 

 డా.నరేంద్రకుమార్,

వైద్య విద్య సంచాలకులు