24-10-2025 11:59:10 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఓ సర్పం కనిపించడంతో సిబ్బంది, ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మున్సిపల్ కార్పొరేషన్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న సంతోష్ సురక్షితంగా పామును పట్టి బంధించాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ ను అభినందించి, స్నేక్ రెస్క్యూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్నేక్ రెస్క్యూ రక్షణ పరికరాలకు అవసరమైన సహకారం తను అందిస్తానని,
జిల్లా కేంద్రంలో స్నేక్ రెస్క్యూ ప్రదర్శన శాల ఏర్పాటు చేస్తే ప్రజలకు విషపూరిత, విష రహిత, అరుదైన సర్పాలపై అవగాహన కలుగుతుందన్నారు. జువాలజీ విద్యార్థులకు, యువతకు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కు దీని పై శిక్షణ ఇవ్వాలని సంతోష్ కు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావున జిల్లా వ్యాప్తంగా ఇట్టి సేవలు విస్తరింప చేయడం వల్ల సమస్య తగ్గుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే భయం పోయి సర్పాలను చంపకుండా, వాటిపై పూర్తి అవగాహన కలుగుతుందని, అవసరమైన పలు అంశాలను సంబంధిత శాఖల అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటారు.