calender_icon.png 11 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఆరోగ్యమే ఉన్నతీకరిస్తుంది

11-10-2025 12:28:16 AM

సీనియర్ సివిల్ జడ్జి 

ఉదయ్ భాస్కర్‌రావు

నిజామాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : *మనుషుల మానసిక ఆరోగ్యమే మంచి మనుషులుగా తీర్చిదిద్దుతుందని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో న్యాయసేవ అధికార సంస్థ స్నేహ సొసైటీ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో మానసిక ఆరోగ్యం గూర్చి అవగాహన సదస్సులు, సమావేశాలు, చర్చగోస్టులు నిర్వహిస్తుందని అంతటి ప్రాధాన్యత ఉన్న అంశంపై న్యాయసేవ సంస్థ, స్నేహ సొసైటీ లు కలిసి ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం వలన సమాజంలో మంచి సందేశం వెళుతుందని ఆయన తెలిపారు. విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్న యువత మానసిక పరిపక్వత కలిగి ఉండాలని ఆయన ఉధ్బొదించారు.

మానసిక ఆరోగ్యమే యువత భవిష్యత్ ను తీర్చిదిద్ది దేశానికి మేధాసంపత్తి కలిగిన యువశక్తిని అందిస్తుందని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు పేర్కొన్నారు. పిల్లలను, యువతను ఆరోగ్యం పట్ల వారి తల్లుల పెంపకమే కీలకమని... ఆ మహిళల మానసిక ఆరోగ్యం విషయంలో వారి పుత్రిక, పుత్రరత్నాలు ప్రత్యేక శ్రద్ధా వహించాల్సిన గురుతర బాధ్యత ఉన్నదన్నారు. వృద్దాప్యలో ఉన్న వృద్ధుల మానసిక ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ వెళ్లాలని జడ్జి కోరారు.

మానసిక వైద్యులు విశాల్, రవితేజ లు మాట్లాడుతూ పని ఒత్తిడి ఎంత ఉన్న మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. సంతోషంగా ఉంటేనే  సంపూర్ణ ఆరోగ్యం మనవంతు అవుతుందని తెలిపారు. స్నేహ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ స్నేహ సోసైటీ లో దివ్యాంగులు, మానసిక ఆరోగ్యం బాగాలేని వారిని అందరిని అక్కున చేర్చుకుని ప్రతిభావంతులుగా మారుస్తున్నామని తెలిపారు.

మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి ప్రసంగిస్తు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసి మానసిక ఆరోగ్యం విషయంలో తమ పరిధిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు.స్నేహ సోసైటీ కార్యదర్శి సిద్దయ్య కార్యక్రమానికి సందానకర్తగా వ్యవహారించారు. కార్యక్రమంలో న్యాయవాది ఆశ నారాయణ, స్నేహ సొసైటీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.