calender_icon.png 13 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దుల వద్ద సైన్యం కుదింపు

13-05-2025 12:55:38 AM

  1. ఇరు దేశాల సైనికులు దూకుడు, కవ్వింపు చర్యలు, కాల్పులు ఆపేయాలి
  2. భారత్-పాక్ డీజీఎంవోల చర్చల్లో అంగీకారం
  3. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి చర్చలు

న్యూఢిల్లీ, మే 12: సరిహద్దుల వద్ద సైన్యాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్-పాక్ డీజీఎంవోలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు భారత్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)ల హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారంగా.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే వీరు చర్చలు జరపాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడి సాయంత్రం చర్చలు జరిగాయి. రెండు దేశాలకు చెందిన సైనికులు ఒక్క తూటాను కూడా పేల్చొద్దని, దూకుడుగా ప్రవర్తించొద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశీఫ్ చౌదరి చర్చల్లో పాల్గొన్నారు. గడిచిన 19 రోజులుగా ఉద్రిక్తతల నడుమ బిక్కుబిక్కుమన్న సరిహద్దు గ్రామాల ప్రజలు ఆదివారం రాత్రి ప్రశాంతంగా గడిపినట్టు భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.