06-08-2025 12:00:00 AM
తుర్కయంజాల్, ఆగస్టు 5: కార్మికుల భద్రతను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. తుర్కయంజాల్లోని అరుణ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభల ఆహ్వాన సం ఘం ఏర్పాటు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిషన్, టి.న ర్సింహ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ వచ్చేనెల 19, 20 తేదీల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సెకండ్ పీఆర్సీలోని మినిమం బేసిక్ రూ.26వేలుగా గుర్తించి కార్మికులకు అందజేయాలని సూచించారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు రూ.50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. అనంతరం ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా తిప్పర్తి యాదయ్య, జనరల్ సెక్రటరీ డి. కిషన్, ట్రెజరర్ సీహెచ్ ఎల్లయ్య, చీఫ్ ప్యాట్రన్ గా పాలడుగు భాస్కర్, ప్యాట్రన్ ఎం. చంద్రమోహన్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, సీఐ టీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.