13-01-2026 02:47:10 PM
హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1,257 గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషన్ పోస్టుల భర్తీ పూర్తి అయింది. ఎంపికైన వారికి కోఠి మెడికల్ కళాశాల ఆవరణలో ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.... ఆరోగ్యశ్రీలో 1835 చికిత్సలు ఉన్నాయని, పేదవాడి సంక్షేమం, ఆరోగ్యభద్రత ప్రభుత్వానిదేనని తెలిపారు. వైద్యానికి ప్రైవేటులో శక్తికి మించి ఖర్చు చేసి.. ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. సమాజానికి సేవ చేయాలనే తపన ప్రతి ఉద్యోగిలో ఉండాలని సూచించారు.
వైద్య శాఖలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ రావాలని ఆకాంక్షించారు. సమాజం సుభిక్షంగా ఉండాలంటే.. విద్య వైద్యం బాగుండాలని మంత్రి తెలిపారు. వైద్యాదరోగ్యశాఖలో దాదాపు 10 వేల పోస్టులు భర్తీ చేశామన్నారు. భవిష్యత్తులో మరో 10 వేల పోస్టులు భర్తీ చేయనున్నామని ప్రకటించారు. విద్య, వైద్యంలో మెరుగ్గా ఉంటేనే.. సమ్మిళిత వృద్ధి సాధించినట్లన్నారు. చికిత్సలో డాక్టర్లు పాత్ర ఎంత ముఖ్యమూ.. ల్యాబ్ టెక్నీషియన్లు, పరికరాలు కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు కావల్సినన్ని నిధులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇస్తున్నారని వెల్లడించారు. రూ. 7200 కోట్ల నిధులతో ఉస్మానియా కొత్త ఆస్పత్రిని నిర్మించుకున్నామని తెలిపారు.
ప్రతి జీజీహెచ్ లో డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోగులు ప్రతి చిన్న చికిత్సకు హైదరాబాద్ లోని పెద్ద ఆస్పత్రులకు వచ్చే పరిస్థితి ఉండొద్దన్నారు. ఎక్కువ చికిత్సలు మండల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో జరగాలన్నారు. బాల భరోసా అనే పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి దామోదర తెలిపారు. అన్ని ఉద్యోగాలు ఒక ఎత్తు.. విద్య, వైద్యంలో విధులు మరో ఎత్తు అన్నారు. వారంలో రోజుకొక ప్రత్యేక వైద్య నిపుణుడు పాలీ క్లినిక్ లో ఉంటారని తెలిపారు. చిత్తశుద్ధి, అంకితభావం లేకుంటే.. విద్య, వైద్య వృత్తిలో న్యాయం చేయలేమని పేర్కొన్నారు. జాతీయ రహదారుల వెంట ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి 30-40 కి.మీ దూరానికొక ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని దామోదర రాజనర్సింహ వెల్లడించారు.