10-07-2025 02:45:57 PM
హైదరాబాద్: కూకట్ పల్లి కల్తీ కల్లు(Kukatpally adulterated toddy) తాగిన ఘటనలో బాధితుల సంఖ్య 44కు చేరింది. కల్తీ కళ్లు బాధితులను నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Health Minister Damodar Rajanarsimha) పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సంఘటనలో ఇప్పటివరకు నలుగురు చనిపోయారని రాష్ట్ర మంత్రి దామోదర పేర్కొన్నారు.
నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో 31 మందికి, గాంధీ ఆసుపత్రిలో ఆరుగురికి, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ఉన్నవారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, నలుగురి ఆరోగ్య పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని, వారికి డయాలసిస్ చేస్తున్నట్లు మంత్రి దమోదర తెలిపారు. ఒక నాలుగైదు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని, ఘటనపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తుందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలుంటామని మంత్రి దమోదర వెల్లడించారు.