calender_icon.png 12 September, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుమూల ప్రాంతాల విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

12-09-2025 05:56:53 PM

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల లో పాల్గొన్నారు. మండలంలోని రూ.2.30 కోట్ల తో నిర్మించిన కస్తూరిబా గాంధీ విద్యాలయం జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.70 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి,రూ. 72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, ఏడు గ్రామపంచాయతీలో రూ. 1.40 కోట్లతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్దపీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

నాణ్యమైన విద్యాబోధనకు డిఎస్సీ నిర్వహించి టీచర్ల నియామకం చేపట్టామని, 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య, భోజనం, విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. నా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోవడం వల్ల నన్ను ఆంగ్ల మధ్యంలో చదివించారని, నాలాగే ఈ మారుమూల ప్రాంతంలోని ఉన్న విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో చదవాలని, బాలికల విద్యకు ఇబ్బంది కలగకూడదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతానికి పెద్ద ఎత్తున కస్తూరిబా గాంధీ పాఠశాలలు, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం కచ్చితంగా చదవాలని చదివిన చదువు తప్పక ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో అందరూ చదువుకుంటే  మొత్తం గ్రామమే బాగుపడుతుందని తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. మన భూపాలపల్లి  జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో, కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో, మోడల్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు టి ఫైబర్ ద్వారా ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని  సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రజలకు అవసరమైన మాలిక వసతులు  సదుపాయాల కల్పన కు ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు వంటి ప్రజా సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు.  గ్రామాలలో మురుగునీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల జీవితాల్లో మార్పు చేస్తున్నామని ఈ క్రమంలోనే పేదల కొరకు రేషన్ కార్డులు, పేదలకు సన్నబియ్యం, 200 లోపు యూనిట్ల  ఉచిత విద్యుత్తు, 500 కే సబ్సిడీపై  గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు కల్పించామని తెలిపారు.