12-09-2025 07:04:09 PM
చాలీచాలని జీతాలతో జీవనం
పంచాయతీ కార్మికుల కుటుంబాలు దయనీయం
జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతినెల జీతాలు చెల్లించడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తి మా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతామని, పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేలకు తగ్గకుండా చెల్లిస్తామని చెప్పడం జరిగిందన్నారు.అలాగే 10 లక్షల వరకు ప్రమాద బీమా, కల్పించి హెల్త్ కార్డులు అందిస్తామని తెలిపినట్లు గుర్తు చేశారు.మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి పాత కేటగిరీలు కొనసాగిస్తామని, గ్రామపంచాయతీ నుండి వేతనాలు కాకుండా ప్రత్యేక గ్రాండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిస్తామని అర్హులైన వారికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
కనీసం ప్రతినెల వేతనాలు చెల్లించకపోవడం వలన కార్మికుల కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. బతుకమ్మ,దసరా పండుగకు ముందే వేతనాలు చెల్లించాలని అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వేతనాలు వచ్చినా రాకున్నా పనులు మాత్రం చేయాలని అధికారులు, కార్యదర్శులు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. అందుచేత మండల పరిధిలోని అన్ని గ్రామాల కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఈనెల 25 తేది లోపు మాకు రావలసిన వేతనాలు చెల్లించకపోతే మరుసటి రోజు 26వ తేదీ నుండి జిల్లాలోని 12 మండలాల ఎంపీడీవో కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.