calender_icon.png 23 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇల్లు గ్రంథాలయంగా మారాలి

23-01-2026 12:29:51 AM

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ రూరల్, జనవరి 22: పుస్తక పఠనాసక్తి కలిగిన వ్యక్తుల ఆలోచనా విధానం, గుణగణాలు సమాజహితంగా ఉంటాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాలకే ఉందని పేర్కొంటూ ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఆకాంక్షించారు. గురువారంపట్టణంలోని సిఎస్‌ఆర్ నిధులతో ఆధునికీకరించిన డిజిటల్ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ గ్రంథాలయంలో అధునాతన కంప్యూటర్లు, వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దినపత్రికలు చదవడాన్ని ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా పుస్తకాలు, దినపత్రికలను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి అధునాతన గ్రంథాలయం లేదని పేర్కొన్న మంత్రి, కొల్లాపూర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, యువత ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆధునాతన పుస్తకాలు, వసతులు కల్పించి గ్రంథాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, ఎమ్మార్వో భరత్కుమార్, డీఎస్పీ బుర్ర శ్రీనివాసులు, కొల్లాపూర్ సీఐ మహేష్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.