05-12-2024 05:00:58 PM
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తన ఇటీవలి వ్యాఖ్యలతో వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ మంత్రులను విమర్శిస్తే ప్రతిపక్ష సభ్యులను హెచ్చరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజంగా రాజీనామా చేశారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకువచ్చారని మంత్రి ఫైర్ అయ్యారు. కోమటి రెడ్డి సోదరుల గురించి గంధపుచెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారని మండిపడ్డారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే మతిభ్రమించి మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు ఎప్పుడూ చేయదని కొండా వెల్లడించారు. రేవంత్ రెడ్డిని గతంలో చిన్న డ్రోన్ కేసులో కక్షపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. కేటీఆర్ వలే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అలా అక్రమంగా అరెస్టు చేయించరు అని తెలిపారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పక్కపక్కన కూర్చునేవారని మంత్రి కొండా సురేఖ గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను ప్రభావితం చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు.